రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో జీ+3 ఇళ్లు మంజూరైన పేదలకు పెద్ద కష్టమే వచ్చిపడింది. బ్యాంకు రుణం రాని లబ్ధిదారులు 18 నెలల్లోనే ఆ మొత్తాన్ని చెల్లించాలని అధికారులు నిబంధన విధించారు. పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టిడ్కో) ఆధ్వర్యంలో తెదేపా హయాంలో 3.09 లక్షల ఇళ్లను 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో షియర్‌వాల్ సాంకేతికతతో చేపట్టారు. ఒక్కో ఇంటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3.90 లక్షల వరకు రాయితీ అందించనున్నాయి. లబ్ధిదారుని వాటా పోనూ మిగతా మొత్తాన్ని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), పురపాలక సంఘాల సహకారంతో బ్యాంకుల నుంచి రుణంగా అందించనున్నారు. ఈ మేరకు అప్పట్లోనే కొందరు లబ్ధిదారులకు బ్యాంకులు రుణాన్ని మంజూరు చేశాయి. ఈ రుణాన్ని 15-20 ఏళ్ల వ్యవధిలో నెల వాయిదాల రూపంలో చెల్లించే వెసులుబాటును నాటి ప్రభుత్వం కల్పించింది. ఎన్నికల హామీలో భాగంగా వైకాపా అధినేత హోదాలో 300 చ.అ. ఇళ్లను ఉచితంగా ఇస్తామని జగన్ ప్రకటించారు. గెలిచాక సీఎం ఆదేశాలతో అధికారులు కార్యరంగంలోకి దిగారు. అయితే 365, 430 చ.అ. ఇళ్ల విషయంలో బ్యాంకుల రుణాలు పొందని లబ్ధిదారులు ఆ మొత్తాన్ని 18 నెలల్లో టిడ్కోకు చెల్లించేలా గడువు నిర్దేశించారు. మెప్మా, పురపాలక కమిషనర్ల సహకారంతో 100% లబ్ధిదారులకు బ్యాంకుల రుణాలు వచ్చేలా చూస్తామని, ఎవరికైనా రుణం లభించకుంటే వారు 18 నెలల్లోనే వాటా మొత్తాన్ని చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. చెల్లించని వారికి నిర్దేశిత గడువు మీరగానే కేటాయింపు రద్దవుతుందని స్పష్టంచేస్తున్నారు. ఉదాహరణకు 365 చ.అ. ఇల్ల్లు ఎంపిక చేసుకున్న లబ్ధిదారునికి బ్యాంకు రుణం ఇవ్వకుంటే రూ.3,52,500 లక్షలను 18 నెలల్లో కట్టాలి. అంటే నెలకు రూ.19,500 చొప్పున చెల్లించాలి. ఈ రుణాన్ని ఆరు త్రైమాసిక వాయిదాల్లోనూ చెల్లించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
దీపావళిలోపు ఇళ్ల కేటాయింపు పత్రాలు
365, 430 చ.అ. విస్తీర్ణంలోని 1.20 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు దీపావళిలోపే కేటాయింపు పత్రాలు అందించేలా అధికారులు కార్యచరణ సిద్ధంచేశారు. వీటితోపాటు సీఎం జగన్ రాసిన లేఖను అందిస్తారు. లబ్ధిదారుని వాటాలో ముందస్తుగా కట్టాల్సిన మొత్తాన్ని (365 చ.అడుగుల విస్తీర్ణానికి రూ.12,500, 430 చ.అడుగుల విస్తీర్ణానికి రూ.25 వేలు) కేటాయింపు పత్రాలు అందిన నెలలోపే చెల్లించాలనే నిబంధన విధించారు. లేనిపక్షంలో ఎలాంటి నోటీసు లేకుండానే కేటాయింపు రద్దవుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ....