Police are investigating the arrest of three people buying TRS MLAs: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న వేళ పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో నగర శివారులో నలుగురు అధికార తెరాస పార్టీ ఎమ్మెల్యేలు గువ్వల బాల్‌రాజ్, పైలెట్ రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావును పార్టీ లో చేర్చుకునేందుకు భాజపాకు చెందిన ముగ్గురు వ్యక్తులు మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్‌లో చర్చలు జరుపుతున్నారనే వార్త కలకలం రేపింది. చర్చలు జరుగుతుండగా పోలీసులు అక్కడకు చేరుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురితో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫాంహౌస్‌ను చుట్టుముట్టారు. నలుగురు ఎమ్మెల్యేలను ఒక వైపు.. మిగిలిన ముగ్గురిని మరో వైపు కూర్చోబెట్టి విచారించారు. ఎమ్మెల్యేలను కలవడానికి వచ్చిన సతీష్ శర్మ, సింహయాజి, నందకుమార్‌గా గుర్తించారు. సింహయాజితో రోహిత్‌రెడ్డికి గతంలో పరిచయం ఉన్నట్టు తేల్చారు. రోహిత్‌రెడ్డి గతంలో సింహయాజి స్వామీజీ చేత తన ఇంట్లో ఓ పూజ కూడా చేయించుకున్నట్టు సమాచారం. తరచూ సింహయాజి స్వామీజీని కలుస్తున్నట్లు సమాచారం. అదే చనువుతో స్వామీజీ భాజాపాలోకి చేరాలని అతనికి చెప్పినట్టు సమాచారం. అతనితో పాటు మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా బుధవారం కలుద్దామని నిర్ణయించారు. ఇందుకు రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ను ఎంచుకున్నారు.
బుధవారం సాయంత్రం సింహయాజి, నందకుమార్, సతీష్‌శర్మ అక్కడికి చేరుకున్నారు. అంతకు ముందే నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఈ సమాచారం అంతా పోలీసులకు ముందుగానే ఎమ్మెల్యేలు చేరవేశారు. దీంతో చర్చలు జరుగుతుండగా పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడి నుంచి గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి పోలీసుల సహాయంతో వెళ్లిపోయారు. అనంతరం రోహిత్‌రెడ్డిని గంటపాటు విచారించారు. అనంతరం ఆయన కూడా పోలీసు వాహనంలో భద్రత మధ్య వెళ్లిపోయారు. సింహయాజి, సతీష్ శర్మ, నందకుమార్‌లను పోలీసులు మూడు గంటల పాటు విచారించారు. తమ ప్రలోభ పెట్టారని ఇబ్బందులకు గురిచేశారని నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వారి ముగ్గురిని అరెస్టు చేశారు.
ఆ తర్వాత వారిని శంషాబాద్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. ఈ ఉదయం వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. ఇందులో నందకుమార్ కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు తెలిపారు. అతను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు వీడియోలు బయటకు రావడం సంచలనంగా మారింది. సింహయాజి అసలు పేరు అశోక్ అని అతను అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం రామనాథపురానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. 15ఏళ్ల క్రితం తిరుపతి వెళ్లి అక్కడే స్వామీజీగా అవతారమెత్తినట్టు తెలిసింది. ఈ కేసులో నగదు స్వాధీనం పై పోలీసులు స్పష్టతను ఇవ్వలేదు. ప్రలోభ పెట్టారనే అంశానికి సంబంధించి ఆధారాలపై పోలీసులు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఎమ్మెల్యేల ప్రలోభాల అంశం రాజకీయ దుమారం రేపింది. ఇరు పార్టీల మధ్య విమర్శ, ప్రతి విమర్శలకు దారి తీసింది.
ఇవీ చదవండి: