కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఏర్పాటును హైకోర్టు నిలుపుదల చేసింది. ప్రభుత్వ స్థలాల్లో విగ్రహాల ఏర్పాటు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని గుర్తుచేసింది. నందిగామ గాంధీ కూడలి వద్ద వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగే రీతిలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నారని, ఆ ప్రక్రియను నిలువరించాలని కోరుతూ వై.రామకృష్ణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇటీవల విచారణ జరిపిన కోర్టు.. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. తాజాగా ప్రభుత్వాసుపత్రి స్థలంలో.. వైఎస్ విగ్రహం ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టారని.. పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై అత్యవసర విచారణ జరపాలని కోరగా అందుకు అంగీకరించిన ధర్మాసనం...విగ్రహం ఏర్పాటుపై స్టే విధించింది. వాహన రాకపోకలకు అడ్డంకులు కలిగేలా గతంలో 14 విగ్రహాలు ఏర్పాటుచేశారని అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాల తమ ముందు ఉంచాలన్న హైకోర్టు....... విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి : నియమించేటప్పుడు ఒక విధులు, తర్వాత వేరే విధులు ఎలా ఇస్తారు? : ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న