తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉపఎన్నికను రద్దు చేసి, రీపోలింగ్ నిర్వహించాలంటూ భాజపా, తెదేపా అభ్యర్థులు వేసిన వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. వాటిని కొట్టివేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ ఎం.గంగారావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకుండా అధికరణ 329 నిషేధం విధిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ప్రస్తుత వ్యాజ్యం లోపలి అంశాల జోలికి వెళ్లలేదని, కేవలం వాటి విచారణ అర్హతలపై మాత్రమే నిర్ణయాన్ని వెల్లడించామని ప్రకటించింది. ఎన్నికల్లో అక్రమాలపై పిటిషనర్లు పిటిషన్ దాఖలు చేయడం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆశ్రయించేందుకు స్వేచ్ఛనిస్తున్నట్లు పేర్కొంది. భారీగా దొంగ ఓట్లు, అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికను రద్దు చేయాలని, ఎన్నికల ఫలితాల్ని ప్రకటించకుండా నిలువరించాలని భాజపా అభ్యర్థి కె.రత్నప్రభ, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, దేవదత్ కామత్ వాదనలు వినిపిస్తూ న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చని తెలిపారు. వాటిని ధర్మాసనం తోసిపుచ్చింది.
ఇవీ చదవండి