దేశ వ్యాప్తంగా 4వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్). రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో దీని శాఖ కార్యాలయాన్ని 2015లో ఏర్పాటు చేశారు. నాడు విజయవాడకు మెట్రో కారిడార్ల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చలు సాగాయి. ప్రణాళికలు రూపొందించారు. డీఎంఆర్‌సీ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు. దీంతో మెట్రోకు అవసరమైన కోచ్‌లు సరఫరా చేసేందుకు బీఈఎంఎల్ ముందుకు వచ్చింది. బుల్‌డోజర్లు, గ్లాడర్‌లు లాంటి యంత్రాలను ఈ సంస్థ రూపొందిస్తుంది.
రాజధానిలో మెట్రోతో పాటు ఇతర కార్యక్రమాలతో వ్యాపారం అభివృద్ధి చెందుతుందని భావించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కొన్ని యంత్రాలను సరఫరా చేశారు. గత రెండేళ్లుగా ఒక్క యంత్రాన్ని అమ్మలేదు. మరోవైపు మెట్రో ప్రాజెక్టు విజయవాడకు రాదని తేలిపోయింది. కోచ్‌లు అందించే పరిస్థితి లేదు. విశాఖపట్నంలో మెట్రో కారిడార్ ప్రణాళికలు రూపొందిస్తున్నా.. అక్కడ కూడా వస్తుందన్న విశ్వాసం లేదని బీఈఎంఎల్ భావిస్తోంది. దీంతో ఈ కార్యాలయాన్ని మూసివేస్తోంది. ఇంతకు ముందు విశాఖ స్టీలుకు చెందిన బ్రాంచ్ కార్యాలయాన్ని విజయవాడ నుంచి గన్నవరానికి మార్పు చేసిన విషయం తెలిసిందే. మెట్రో కార్యాలయాన్ని మార్పు చేశారు. ప్రస్తుతం బీఈఎంఎల్ శాఖను ఎత్తేస్తున్నారు.
ఇదీ చదవండీ...
గండికోట జలాశయం ముంపు బాధితులు ఇచ్చిన అఫిడవిట్లను కోర్టుకు సమర్పించాలి: హైకోర్టు