Tempalle Villagers Drinage Problems: చినుకు పడితే చిత్తడి అయ్యే రోడ్లు.. మంచినీరు తాగేందుకు పైపులైన్లు లేని ఇళ్లు. .రోడ్డుపైకి రావాలంటే భయపడుతున్న గ్రామస్థులు.. ఇది కృష్ణా జిల్లా గన్నవరం మండలం తెంపల్లి గ్రామప్రజల దుస్థితి. సరిగ్గా ఏడాది కిందట తెంపల్లి గ్రామంలో హఠాత్తుగా డయేరియా ప్రబలింది. మరణాలు సంభవించాయి. స్థానికుల నిరసనలతో అప్రమత్తమైన అధికారులు.. కొన్నిరోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందించారు. అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా గ్రామంలో సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. మంచినీటిలో బ్యాక్టీరియా ఉందని తేలిందన్నారు. కొత్త పైపులైన్లకు 32 లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. వెంటనే నూతన పైపులైన్లు వేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. అది ఆరంభశూరత్వంగానే మిగిలింది. ఏడాది గడిచినా సమస్య పరిష్కారం కాలేదు. గ్రామంలో అందరికీ మంచినీళ్లు అందించే మోటరు.. నేటికీ మురికి నీటిలో కూరుకుపోయింది.
"పంచాయతీ ప్రెసిడెంట్ని అడిగితే నిధులు రాలేదని అంటున్నారు. ఈరోడ్డుకు శంకుస్థాపన చేశారు. కానీ ఇంతవరకు రోడ్డు పోయలేదు. గత సంవత్సరం డయేరియా వచ్చి 8మంది చనిపోయారు. ఇంతవరకు తెంపల్లి ప్రజలను పట్టించుకున్న నాథుడే లేడు. మురుగు నీరు వల్ల కనీసం నడవలేక పోతున్నాం. పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు."-స్థానికులు, తెంపల్లి
నూతన పైపులైన్లు వేసేందుకు.. పాతవి తీసేశారు. కొన్నిచోట్ల కొత్త పైపులు వేశారు. వెంటనే నిధులు లేవంటూ పనులు మధ్యలో నిలిపేశారు . ఆ తర్వాత జల్‌జీవన్ మిషన్ కింద 62 లక్షల రూపాయలతో పనులు పూర్తి చేస్తామని ప్రకటించినా.. పని జరగలేదు. గ్రామస్థులు ఊరికి దూరంగా ఉన్న వాటర్ ట్యాంక్ నుంచే నీటిని తెచ్చుకుంటున్నారు. అక్కడా శుభ్రత లేకపోయినా.. ఇంకో గత్యంతరం లేదని.. గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"డ్రైనేజీ కాల్వ తవ్వక పోవడం వల్ల మురుగు నీరు వెనక్కి తన్ని ఇంట్లోకి వస్తుంది. దోమలతో నానా అవస్థలు పడుతున్నాం. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా గుంతలు తవ్వుతామంటున్నారు కానీ పట్టించుకోవడం లేదు."-స్థానికులు, తెంపల్లి
ఏడాది క్రితమైనా, ఇప్పుడైనా అసలు తెంపల్లికి తంటాతెస్తోందే మురుగునీరు. కానీ.. గ్రామస్థులు నేటికీ ఆ మురికి నీటి మధ్యే.. నడవాల్సిన దుస్థితి. డయేరియా విజృంభించినప్పుడు అధికారులైతే హడావుడి చేశారు. ఏడాదిలో కొన్ని చోట్ల సైడ్ కాల్వలు నిర్మించారు. కానీ ఆ వ్యవస్థ బయటక వెళ్లే మార్గాన్ని.. అనుసంధానం చేయలేదు. ఫలితంగా మురుగంతా రోడ్లను ముంచెత్తుతోంది. ఇళ్లముందు,..పెద్ద బురద మడుగులు తయారయ్యాయి. కొన్నిచోట్ల..... కాలుతీసి కాలువెయ్యడానికే కంపరంగా ఉంది. వర్షాకాలం మొదలవడంతో.. ఇక దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. తెంపల్లిలో 3వేల 900 మంది జనాభా ఉంటారు. వానముసురేస్తే.. గ్రామం మరోసారి మంచం పడుతుందేమోనని... ఆందోళన చెందుతున్నారు.