కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ జరగనుంది. కృష్ణా వ్యాప్తంగా మండల ఒకటి చొప్పున 51 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు రెండింటికీ ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. 30 వేలకు పైగా ఓటర్లు.. ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. విజయవాడలోని బిషప్ హజరయ్య బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో.. పలువురు అధ్యాపకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. కొవిడ్ వ్యాప్తి నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
నాలుగు జిల్లాల్లో కలిపి 227 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2,200 మంది ఎన్నికల సిబ్బంది, 2,400 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేవారు.. పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే ఊదారంగు స్కెచ్‌ను మాత్రమే వినియోగించాలని అధికారులు స్పష్టం చేశారు. మావోయిస్టు ప్రభావిత రంపచోడవరం, ఎటపాక, కుక్కునూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.
మైలవరంలో...
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు.. స్థానిక హనిమిరెడ్డి ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మైలవరం వ్యాప్తంగా మొత్తం 106 ఉపాధ్యాయ ఓట్లు ఉండగా.. 58 మంది పురుషులు, 38 మంది మహిళలు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహిస్తామని తహసీల్దార్ రోహిణీ దేవి తెలిపారు.
ఉయ్యూరులో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్...
కృష్ణా జిల్లా ఉయ్యూరులో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 20 వార్డులకు 186 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. వీటిలో వైకాపా-41, తెదేపా- 22, జనసేన-1, నోట-2, చెల్లుబాటు కానిది-ఒకటి ఉన్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైంది.
ఇదీ చదవండి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం