WhatsApp Service for Grain purchase: రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ, రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 73373-59375 నెంబర్‌ను దీనికోసం కేటాయించామన్నారు. ధాన్యం అమ్మాలనుకున్న రైతులు నెంబర్‌కు హాయ్ అని సందేశం పంపగానే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్‌తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని తెలిపారు.
ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి నాదెండ్ల తెలియజేశారు. రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తరువాత రైతు పేరును ధ్రువీకరించాల్సి ఉంటుందన్నారు. ధాన్యం అమ్మవలసిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తరువాత ధాన్యం అమ్మాలనుకున్న తేదీకి సంబంధించిన మూడు ఆప్షన్లు ఇస్తారన్నారు. అందులో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాల్సి ఉంటుందని మంత్రి ప్రకటనలో తెలిపారు.
రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదు. 73373 59375 నెంబర్ కి వాట్సాప్ నుంచి Hi చెబితే చాలు... సేవలు అందుబాటులోకి వస్తాయి. మీరు ఏ కేంద్రంలో, ఏ రోజు, ఏ టైములో, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు అమ్మదలుచుకున్నారో మెసేజ్ ఇస్తే స్లాట్ బుక్ అవుతుంది. సులభంగా… pic.twitter.com/TPXmSVDCSp
— Manohar Nadendla (@mnadendla) November 17, 2024
దేశంలో ఎక్కడా లేని పథకం ఇది - కోటిన్నర మందికి లబ్ధి : మంత్రి నాదెండ్ల
ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అమ్ముకోవచ్చు: అనంతరం సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలనీ సూచించారు. ఆపైన ఎలాంటి రకం ధాన్యం అమ్మాలనుకుంటున్నారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుందన్నారు. తరువాత వచ్చే సందేశంలో ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మాలనుకుంటున్నారో అన్నది అక్కడ నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేస్తూ కూపన్ కోడ్ వస్తుందనీ పేర్కొన్నారు. దీంతో రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ, సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అమ్ముకోవచ్చన్నారు.
ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్‌తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సప్ ఆప్షన్లు అందరికీ అర్ధమయ్యే రీతిలో ఇచ్చామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటలకు గంటలు రైతులు వేచి ఉండటం లాంటి సమస్యలు ఉండవన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్‌ను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు. రైతుల ఇబ్బందులను గుర్తించి సాంకేతికత వినియోగించి ధాన్యం కొనుగోలు సరళతరం చేశామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ కింద ఈ సేవలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని మంత్రి పేర్కొన్నారు.
ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు: నాదెండ్ల మనోహర్