విద్యార్థుల భవిష్యత్తుకు పరీక్షలు అవసరమే కానీ ఇది సమయం కాదని గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ భరత్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహించాలనే ప్రభుత్వం నిర్ణయిస్తే.. వాయిదా వేయటం సబబని సూచించారు. పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రులతో తెలుగుదేశం పార్టీ యువనేతలు ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ..
"గత ఏడాది కూడా పరీక్షల నిర్వహణపై డైలమా నెలకొంది. గీతం విద్యాసంస్థల్లో ఫైనలియల్ విద్యార్థుల వరకూ ఆన్లైన్ పరీక్షలు నిర్వహించి మిగిలిన విద్యార్థులను ఇంటర్నల్ పరీక్షల మార్కులు ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేశాం. నెలన్నర క్రితం వరకూ ఈసారి పరీక్షలు భౌతికంగా నిర్వహించాలని భావించాం. కానీ పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేశాం. పరీక్షల వాయిదా వల్ల విద్యాసంవత్సరం కొంచెం ముందుకు జరుగుతుంది తప్ప ఇబ్బంది లేదు. గత ఏడాది అలాగే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచనలు చేయాలి. మొదటి దశతో పోల్చితే రెండో దశలో 45ఏళ్ల లోపు వారిపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఆక్సిజన్ కొరత కూడా ఉన్న పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణకు ఇది సమయం కాదు." అని హితవు పలికారు.
సమావేశంలో యువ నేతలు కిలారు నాగ శ్రావణ్, జ్యోతుల నవీన్, బండారు అప్పల నాయుడు పాల్గొన్నారు. ఎవరైనా చెప్తే ఎందుకు చేయాలనే ఆలోచన జగన్ కు తగదని వారు హితవు పలికారు. సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: