వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షపోరుకు సిద్ధమైంది. నూతన ప్రభుత్వ పాలనపై 6నెలలు వేచిచూసి... ఆ తర్వాత కార్యాచరణలోకి దిగాలని తొలుత భావించినా.... అందుకు ప్రభుత్వమే అవకాశం ఇవ్వలేదన్నదని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన 2నెలల్లోనే పలు ప్రజా సంఘాలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టాయి. ముఖ్యమంత్రి నివాసాన్ని ధర్నా కేంద్రంగా ఎంచుకుని తరచూ నిరసనలు చేశాయి. ఇక వేచి చూసే ధోరణికంటే ప్రత్యక్షపోరుకు దిగటమే సబబని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.
తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో... ఆ తర్వాత జరిగిన రాష్ట్ర స్థాయి భేటీలోనూ చర్చించి అధినేత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆకలి అయినప్పుడు అన్నం పెట్టాలి, అప్పుడే అన్నం విలువ తెలుస్తుందంటూ సీనియర్‌నేతలు... ఇప్పుడే జనంలోకి వెళ్లడం సబబు కాదన్న ఇంకొందరి సూచనలు... ఇప్పటి నుంచే నిరసనలు, ఆందోళనలంటూ జనం మధ్యకు పోవాల్సిన పనిలేదని మరికొందరు నేతలు తమతమ అభిప్రాయాలను అధినేత చంద్రబాబుతో పంచుకోగా... ఒక రాజకీయ పార్టీగా నిత్యం ప్రజల మధ్య ఉండటమే మంచిదనే భావనకు అధిష్ఠానం వచ్చింది.
అన్న క్యాంటీన్ల మూసివేత చర్యను ప్రజలెవ్వరూ హర్షించటంలేదనే అభిప్రాయం అందరిలోను వ్యక్తం కావటంతో... శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మూసినేసిన అన్న క్యాంటీన్ల వద్ద ఆందోళనలు చేపట్టాలని తెలుగుదేశం నిర్ణయించింది. క్యాంటీన్ల పున:ప్రారంభం కోసం ఆందోళనలు చేస్తే... వారిపై కేసులు నమోదు చేయటాన్ని నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. విజయవాడ నగర పరిధిలోని నియోజకవర్గాల్లో ఉన్న క్యాంటీన్లన్నింటిలో ఇవాళ పెద్ద ఎత్తున నిరసన తెలిపేలా నేతలు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అన్న క్యాంటీన్ల సమస్యపై పోరు అనంతరం... ఇసుక కొరతపైనా ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహించేందుకు తెలుగుదేశం సిద్ధమవుతోంది.
ఇదీ చదవండీ...