TDP Pattabhiram on Inner Ring Road Lands : రాజధాని ముందే ఊహించి హెరిటేజ్ సంస్థ ఇన్నర్ రింగురోడ్డు ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిందంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్ని తెలుగుదేశం తిప్పికొట్టింది. హెరిటేజ్ (Heritage) సంస్థ 2014 మార్చిలోనే... కంతేరు ప్రాంతంలో భూములు కొనుగోలుకు తీర్మానం చేసిందని, ఆ సమయంలో ఎన్నికలే జరగలేదని స్పష్టం చేసింది. 2016లో కుంభకోణం గురించి తెలిసిందంటున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి... అప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం నిలదీశారు.
ఇన్నర్ రింగురోడ్డుకు, బైపాస్ రోడ్డుకు తేడా తెలియకుండా వైసీపీ నాయకులు, సీఐడీ (CID) అధికారులు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. స్కిల్ సెంటర్లే లేవంటున్న వైసీపీ నాయకులకు వాటిని చూపిస్తామన్న పట్టాభి.. లేని రింగురోడ్డు ఉందంటూ కేసులు పెడుతున్న అధికార పార్టీ దాన్ని చూపించాలని సవాల్ చేశారు. హెరిటేజ్ సంస్థ కొన్ని ప్రాంతాల్లో భూములు కొనాలని 2014 మార్చి 21న నిర్ణయించిందన్న పట్టాభి.. అప్పటికి రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయా? అని నిలదీశారు. మార్చి 21 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నారని గుర్తు చేశారు. మార్చి 2014 నాటి తీర్మానాన్ని పేర్నినాని, సీఎం జగన్ ఒకసారి చూసుకోవాలని హితవు పలికారు.
ఎఫ్ఐఆర్ నమోదు కాగానే సీఐడీకి హెరిటేజ్ సంస్థ అన్ని వివరాలతో లేఖ రాసి వాస్తవాలన్నీ వెల్లడించింది. తీర్మానం కాపీని సీఐడీకి హెరిటేజ్ ఫుడ్స్ (Heritage Foods) ప్రెసిడెంట్ సాంబశివరావు పంపారు. సీఐడీకి పంపిన తీర్మానం కాపీని ఎందుకు బయటపెట్టట్లేదు అని ప్రశ్నించారు. బోర్డు సమావేశంలో కంతేరులో 7.21 ఎకరాలు కొనుగోలుకు తీర్మానం చేశారు.. మార్చి 2014 తీర్మానం ప్రకారం జులై 1న 7.21 ఎకరాలు కొనుగోలు చేశారు.. అదే ప్రాంతంలో జులై 31న మరికొంత భూమి కొనుగోలు చేశారు అని వెల్లడించారు.
వైసీపీ నాయకుల రాజకీయ జీవితం ముగిసినట్లే.. రాష్ట్ర విభజనకు ముందే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కంతేరులో భూములు కొన్నారు. ఆయా ప్రాంతాల్లో భూములు కొనాలని 2014 మార్చి 21న నిర్ణయించారు.. అప్పటికి రాష్ట్రంలో ఎన్నికలు జరగలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మార్చి 2014 నాటి తీర్మానాన్ని పేర్ని నాని, సీఎం జగన్ ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. హెరిటేజ్ సంస్థ విస్తరణ కోసం అనేక రాష్ట్రాల్లో భూములు కొన్నారు.. అందులో భాగంగానే భూములు కొనాలని తీర్మానం చేసుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు కాగానే సీఐడీకి హెరిటేజ్ సంస్థ అన్ని వివరాలతో లేఖ రాసి వాస్తవాలన్నీ వెల్లడించింది. తీర్మానం కాపీని సీఐడీకి హెరిటేజ్ ఫుడ్స్ ప్రెసిడెంట్ సాంబశివరావు పంపారు. - పట్టాభిరామ్, టీడీపీ అధికార ప్రతినిధి