వైకాపా ప్రభుత్వం తిరోగమనంలోనే పనిచేస్తోందని, అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలు చర్చించకుండా ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేశారని తెదేపా ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అశోక్ బాబు ఆరోపించారు. విజయవాడలో మాట్లాడిన ఆ పార్టీ నేతలు... వైకాపా ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ఆంగ్ల మాధ్యమం, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై బిల్లులకు తెదేపా మద్దతు తెలిపిందన్న నేతలు.. తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలనే తెదేపా పట్టుబట్టిందని స్పష్టం చేశారు.
ప్రతిపక్షనేతగా అలా... ప్రభుత్వాధినేతగా ఇలా
మూడు రాజధానులు రావొచ్చని సీఎం జగన్ చేసిన ప్రకటనను తెదేపా ఎమ్మెల్సీలు తప్పుబట్టారు. సీఎం రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నపుడు అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అంగీకరించి, ఇప్పుడు మాట మార్చారని బచ్చుల అర్జునుడు ఆరోపించారు. సీఎం జగన్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, నిపుణుల కమిటీ నివేదిక రాకుండానే రాజధానిపై వ్యాఖ్యలు చేయడమేంటని ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. అనాలోచిత ప్రకటనలను.. సీఎం జగన్ వెనక్కి తీసుకోవాలని బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు.
ఎంతటి పోరాటానికైనా సిద్ధం
రాజధానిపై వేసిన జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వకుండానే రాజధానిపై సీఎం ఎలా ప్రకటన చేస్తారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు ప్రశ్నించారు. రాజధాని ఐదు చోట్ల పెట్టండి, మూడు చోట్ల ఎందుకని ఎద్దేవా చేశారు. సీఎం సరైన ఆలోచన చేయకపోతే, రాజధానిపై ఎంతటి పోరాటానికైనా తెదేపా సిద్ధమని హెచ్చరించారు.
ఇదీ చదవండి: