కృష్ణా జిల్లాలో అధికార వైకాపా నాయకుల అక్రమాలు, అరాచకాలు, అవినీతి పెచ్చు మీరుతోందని తెదేపా నాయకులు ఆరోపించారు. దళితులు, బీసీలు, మహిళలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. తెదేపా నాయకులపై తప్పుడు కేసుల పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా, ఇళ్ల స్థలాలు, మద్యం అమ్మకాల్లో అవినీతితో పాటు, భూ కబ్జాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంపై కలెక్టర్ ఇంతియాజ్‌కు తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు.
వైకాపా నేతలపై తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. భూ కబ్జాలకు పాల్పడుతూ బెదిరింపులకు దిగుతున్నారని తెదేపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇతర నాయకులు కలెక్టరుకు వివరించారు. పెనమలూరు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కొనుగోలు విషయంలో, స్థలాల చదునులోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
మచిలీపట్నం నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నామని మడ అడవులను నరికి వేస్తున్నారని, ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను కేటాయిస్తున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అంబులెన్స్‌లో తరలిస్తున్న మద్యం పట్టివేత