ప్రభుత్వం కేవలం కక్షసాధింపు చర్యలతో ప్రతిపక్షానికి చెందిన వారిని అక్రమ కేసుల్లో ఇరికించుకుంటూ పోతోందని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. దానికి తగ్గ మూల్యం తప్పనిసరిగా జగన్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. ఆయనతో పాటు తెదేపా నేతలు గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, నాగుల్‌మీరా, జడ్పీ మాజీ ఛైర్మన్ గద్దె అనురాధ, అనిత ఉన్నారు.
ప్రభుత్వం ఏడాదిపాలనతో ప్రజలు పూర్తిగా విసిగిపోయారని తెదేపా నేతలు ఆరోపించారు. రాబోయే నాలుగు సంవత్సరాలు ఎలా ఉంటుందో అన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. వైకాపా తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. ఎవరి పరిపాలన ఎలా ఉందో ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారని తెలిపారు.
కృష్ణాజిల్లాకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులు ఇద్దరు కలిసి రోజూ వంద లారీల ఇసుకను తెలంగాణకు అక్రమ రవాణా చేస్తున్నా.. అధికార యంత్రాంగం ఏం చేస్తోందని కేశినేని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ అక్రమ విధానాలను సమర్ధించడం సరికాదని సూచించారు.
ఇదీ చదవండి: శ్రీకాకుళం జిల్లా విభజనపై ప్రజల్లో ఆవేదన : ఎమ్మెల్యే ధర్మాన