TDP Leader Kollu Ravindra fire on Perni Nani: మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటికి సమీపంలోనే ఎస్సీ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందనీ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. యువతికి డ్రగ్స్ ఇచ్చి, మద్యం తగ్గించి అత్యాచారం చేశారని మండిపడ్డారు. నిందితుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కావటం వల్ల ఈ విషయం బయటకు రాకుండా పోలీసులు నానా హైడ్రామా నడిపారని కొల్లు ఆరోపించారు. నిందితుడు ఆవుల సతీష్.. పేర్ని నాని కుమారుడికి స్నేహితుడని కొల్లు తెలిపారు. ఆ ఆడపిల్లకు అన్యాయం జరిగితే రాజకీయ దురుద్దేశంతో కేసు నమోదు కాకుండా పేర్ని నాని అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే పోలీసులు కేసు నమోదు చేయకుండా మాఫీ చేశారని కొల్లు రవీంద్ర విమర్శించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మచిలీపట్నంలో జరిగిన ఘటన దురదృష్టకరమని కొల్లు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతున్నాయని విమర్శించారు. మొన్న బాపట్ల జిల్లా రేపల్లె ఘటన, నేడు మచిలీపట్నంలో యువతిపై అత్యాచారం.. ఇలా రాష్ట్రంలో ఏదో మూల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పార్టీపరంగా కాకుండా.. ఎవరినైనా సరే శిక్షించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనలో దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని కొల్లు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.
"మంత్రి పేర్నినాని ఇంటి వద్ద ఎస్సీ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. యువతికి డ్రగ్స్ ఇచ్చి, మద్యం తాగించి అత్యాచారం చేశారు. నిందితుడు వైసీపీ నేత కావటంతో పోలీసులు హైడ్రామా నడిపారు. నిందితుడు ఆవుల సతీష్ పేర్ని నాని కుమారుడికి స్నేహితుడు. రాజకీయ దురుద్దేశంతో కేసు కాకుండా పేర్ని నాని అడ్డుపడ్డారు. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే పోలీసులు కేసు మాఫీ చేశారు. ఘటనపై విచారణ జరిపించి బాధితురాలికి న్యాయం చేయాలి"-కొల్లు రవీంద్ర, టీడీపీ నేత
అసలేం జరిగింది: మచిలీపట్నంలోని ఎస్సీ వసతి గృహంలో ఉంటూ ఓ విద్యార్థిని డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటోంది. ఆదివారం మధ్యాహ్నం పని ఉందని బయటకు వెళ్లింది. సాయంత్రమైనా ఆమె తిరిగి హాస్టల్‌కి రాకపోవటంతో.. ఆచూకీ కోసం హాస్టల్ సిబ్బంది వెతికారు. ఎంత వెతికినా ఆమె ఎక్కడుందనే విషయం తెలియలేదు. చివరకు రాత్రి పది గంటల సమయంలో మద్యం మత్తులో, అపస్మారక స్థితిలో విద్యార్థిని హాస్టల్‌కు వచ్చింది. దీంతో ఆమెను హాస్టల్ సిబ్బంది.. జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమెపై ఆత్యాచారం జరిగినట్లు గుర్తించారు.