TDP Leader Devineni Uma: విద్యుత్ బాదుడు ఉండదని చెప్పి రూ.11వేల 600 కోట్ల భారం వేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా దుయ్యబట్టారు. 33 నెలల్లో 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. ఏప్రిల్ లో 7వ సారి విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నారని ఉమా ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే 500 యూనిట్లు దాటితే 90పైసలు పెంచి 1300 కోట్ల రూపాయల భారం వేశారన్నారు.
శ్లాబులు పెంచి 1500 కోట్ల భారం వేశారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.. కిలోవాట్ కి 10 రూపాయలు పెంచి 2వేల 600 కోట్ల రూపాయల భారం వేశారని విమర్శించారు. పక్క రాష్ట్రం నుంచి 5 వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉన్నాయని.. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. యూనిట్ ఎంతకు కొంటున్నారో, ఎంతకిస్తున్నారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ట్రూఅప్ చార్జీలను పూర్తిగా నిలుపుదల చేయడంతో పాటు రైతాంగం మెడకి ఉరేసుకోకుండా చూడాలని కోరారు.
ఎక్కడా కోతలు లేవు..
AP Secretary of Energy Department: నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ స్పష్టం చేశారు. 18 లక్షల కనెక్షన్లకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తోందని.. ఇందుకోసం రూ.7,700 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో 2,400 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉందని చెప్పారు. రాష్ట్రానికి దీర్ఘకాలిక విద్యుత్ ఒప్పందాలు ఉన్నాయని.. అధిక డిమాండ్ వేళల్లో మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నామని వివరించారు.
జెన్‌కో నుంచి 2,656 మెగావాట్లు, కృష్ణపట్నం నుంచి 930 మెగావాట్ల విద్యుత్ మాత్రమే వస్తోందని ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. 500 మెగావాట్ల వరకు సౌర, పవన విద్యుత్ వస్తోందన్న ఆయన.. బహిరంగ మార్కెట్ నుంచి 500-700 మె.వా. వరకు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. కొరత సమయాల్లో బహిరంగ మార్కెట్‌లో కొంటున్నామని పేర్కొన్నారు.
"సాయంత్రం వేళ రూ.7 వరకు యూనిట్ ధర పెరుగుతోంది. సౌరవిద్యుత్ వల్ల పగటిపూట రూ.2కే మార్కెట్‌లో దొరుకుతుంది. అర్ధరాత్రి వేళ రూ.5లోపే యూనిట్ ధర ఉంటోంది. ధరల వల్లే దీర్ఘకాలిక ఒప్పందాలకు వెళ్లడం లేదు. ఇతర రాష్ట్రాల్లాగే బిడ్డింగ్ చేసి కొనుగోలు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా విధానాలు మారడం వల్లే ముందస్తు చెల్లింపులు చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా కరెంటు కోతలు లేవు" - ఎన్.శ్రీకాంత్, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి
ఇదీ చదవండి
రాష్ట్రపతి ప్రత్యేక ఆహ్వానం.. మొఘల్ గార్డెన్స్ సందర్శనలో 'సీజేఐ' దంపతులు