40 రోజుల్లో 40 యూటర్న్లు: జవహర్
ముఖ్యమంత్రి జగన్ 40 రోజుల్లో 40 యూటర్న్లు తీసుకున్నారని తెదేపా నేత జవహర్ ఆరోపించారు. తాను సీఎం అయ్యానని జగన్ ఇంకా నమ్మలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను ధ్వంసం చేయగలరు... కానీ ప్రజల మనసుల్లో ఉన్న చంద్రబాబు ముద్రను ఎవరూ చెరపలేరని అన్నారు. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం ఆధ్వర్యంలో గోదావరి జలాలకు హారతి కార్యక్రమంలో జవహర్ మాట్లాడారు.
ఇంకో ఏడేళ్లయినా జగన్ పోలవరం కానివ్వరు: వంశీ
మెట్ట గ్రామాల చెరువుల్లో నీళ్లున్నాయంటే పట్టిసీమే కారణమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. పట్టిసీమ నీళ్లతో గుంటూరు, కృష్ణా డెల్టాల్లో సమృద్ధిగా పంటలు పండినా... జగన్ సర్కారు ఎకరా కూడా పండలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకో ఏడేళ్లయినా జగన్ పోలవరం కానివ్వరని వంశీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పట్టిసీమకు భూసేకరణ సమయంలో ఒక్కరోజులోనే 720 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమయ్యేలా చేశారని గుర్తు చేశారు. ఐదు వందల మోటార్లు ప్రభుత్వానికి ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పిన వంశీ.. ఆ మోటార్లతో రైతులు నీటిని తోడుకునే వెసులుబాటు కల్పించాలని వంశీ డిమాండ్ చేశారు.
పట్టిసీమ దండగో పండగో జగన్ చెప్పాలి: దేవినేని
పట్టిసీమ దండగో పండగో జగన్ సమాధానం చెప్పాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. తెదేపా ఆవిర్భావం రోజునే పట్టిసీమకు శంకుస్థాపన చేసామని ఆయన అన్నారు. 139 రోజుల్లో కృష్ణ-గోదావరి అనుసంధానం చేసిన నాయకుడు చంద్రబాబు అని తెలిపారు. జీవితాంతం పట్టిసీమను వ్యతిరేకిస్తాం అన్నట్లు జగన్ తీరుందని దేవినేని ఉమా విమర్శించారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లాలి కాబట్టే ముందు రోజు పోలవరం పరిశీలనకు వెళ్లారని దుయ్యబట్టారు.