రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై అంచనా కోసం మరోమారు సర్వే చేపట్టాలని.. ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటి సర్వేతో... ప్రతి ఇంట్లోనూ ఉన్నవారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. సర్వే ప్రక్రియ గురువారంలోగా పూర్తి చేయాలని నిర్దేశించారు. తర్వాత కూడా తాజా వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలని స్పష్టం చేశారు. సర్వే సమాచారం ఆధారంగా కరోనా నివారణకు చర్యలు చేపట్టాలని టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఆదేశించారు.
ప్రజలు నిబంధనలు పాటించాలి
విదేశాల నుంచి వచ్చిన వారు... వారితో సన్నిహితంగా ఉన్నవారు సహా... ఇతరులకూ కరోనా సంక్రమించిందా అన్న కోణంలో సర్వే చేయాలని సీఎం అధికారులకు సూచించారు. కరోనా లక్షణాలున్న వారికి సత్వర వైద్య సహాయం అందించాలని స్పష్టం చేశారు. సామాన్యులు కరోనా బారిన పడకుండా ఉండాలంటే... వైద్య ఆరోగ్యశాఖ, ప్రభుత్వ సూచనలను పాటించాలన్నారు. సర్వే సమాచారాన్ని విశ్లేషించి మరిన్ని చర్యలు చేపడతామన్న ఆయన.. లాక్‌డౌన్ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని పునరుద్ఘాటించారు.
ఇదీ చూడండి: