Dussehra celebrations : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. 8వ రోజు కనకదుర్గ అమ్మవారు.. దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున 3 గంటల నుంచే..భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. బంగారు కిరీటం, చేతిలో త్రిశూలం ధరించి.. కాలి కింద మహిషురుణ్ని తొక్కిపెట్టిన దుర్గమ్మను చూసేందుకు పోటెత్తారు. భవానీ మాలధారణ భక్తులు అమ్మను దర్శించుకొని తరించారు. చినజీయర్ దుర్గామాతకు సారె సమర్పించారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో .. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆయుధ పూజ ఘనంగా జరిగింది. స్వామి, అమ్మవారుల కళ్యాణోత్సవ మండపంలో దేవతామూర్తుల ఆయుధాలకు పూజలు చేశారు. తర్వాత దీప ధూప నైవేద్యాలను సమర్పించారు. ఈ ఉత్సవాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించారు.
చిట్టివలసలో ... శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చిట్టివలసలో దుర్గాదేవికి 108 మంది మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలు ఆకట్టుకున్నాయి. విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారు 8వ రోజు మహాకాళి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాక్షస సంహారం కోసం ఉగ్రరూపం ధరించిన అమ్మవారి రూపం భక్తులను ఆకట్టుకుంది.
కురుపాం మార్కెట్ లో... విశాఖ వన్ టౌన్ కురుపాం మార్కెట్ ప్రాంతంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శ్రీమహాలక్ష్మి రూపంలో దర్శనమిచ్చారు. 6 కిలోల స్వర్ణాభరణములు, బంగారు చీర, పసిడి బిస్కెట్లతో పాటు 2 కోట్ల విలువైన నోట్లతో దేవిని అలంకరించారు. విశాఖకు చెందిన తెన్నేటి సిద్ధాంతి దుర్గాష్టమి విశిష్టతను, ఆయుధ పూజచేయడం వల్ల కలిగే ఫలితాలను తెలియజెప్పారు.
అంబాజీపేటలో .. కోనసీమ జిల్లా అంబాజీపేటలో వాసవీమాతకు ముంగండ ఆర్యవైశ్య సంఘం 58 రకాల పిండివంటలు, సారే సమర్పించారు. పశ్చిమగోదావరి జిల్లాలో అమ్మవారి ఆలయాల్లో శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. తణుకు గోస్తని తీరాన ఉన్న శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
కనిగిరిలో పోలేరమ్మ ఆలయంలో ... ప్రకాశం జిల్లా కనిగిరిలో పోలేరమ్మ ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దొంతులమ్మ దేవస్థానంలో దొంతులమ్మ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి.