State Govt ignore Jaljeevan Mission: 2024 చివరి నాటికి వంద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ 55 లీటర్ల సురక్షిత తాగునీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో.. కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 26 వేల 309 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే పథకానికి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం వాటా భరించాలని నిర్ణయించాయి. కేంద్రం తమ వాటా నిధులిచ్చినా, వైసీపీ ప్రభుత్వం మాత్రం వాటా సంగతి పట్టించుకోవడం లేదు. కనీసం కేంద్ర నిధులనైనా ఖర్చు చేసిందా అంటే అదీ లేదు. ఈ పథకం అమల్లో జాతీయస్థాయిలో అట్టడుగున నిలిచి.. రాష్ట్రం పరువును జగన్ సర్కార్ గంగలో కలిపేసింది.
Water problem: బిందెడు నీటి కోసం బండెడు కష్టం.. అయినా నిరాశే..!
గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్య ప్రజల్ని తీవ్రంగా వేధిస్తోంది. ఏటా వేసవి వచ్చిందంటే మైళ్ల దూరం నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్న దుస్థితి ఇప్పటికీ తీవ్రస్థాయిలో ఉంది. కలుషిత నీరు తాగి ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్న గ్రామీణుల అవస్థలు మనసున్న ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తున్నా.. సీఎం జగన్‌ని మాత్రం కదిలించలేకపోయాయి. ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఉద్దేశించిన జలజీవన్ మిషన్‌ను వినియోగించుకోలేని అసమర్థత కారణంగా.. తాము దప్పికతో అల్లాడిపోతున్నామని ప్రజలు వాపోతున్నారు.
Central Grants 2019-20లో 26వేల 309 కోట్ల అంచనా వ్యయంతో జలజీవన్ మిషన్ పనులు మొదల్యయ్యాయి. తొలివిడతగా కేంద్రం 372.64 కోట్లు ఇచ్చింది. 2020-21లో మరో 790.48 కోట్లు మంజూరు చేసింది. ఐతే జగన్ సర్కారు సకాలంలో ఖర్చు చేయకపోవడం, రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో.. కేంద్రం 297.62 కోట్ల రూపాయలే విడుదల చేసింది. ఇక 2021-22లో 3వేల 812.88 కోట్లు మంజూరు చేసి... 791.06 కోట్లు విడుదల చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా కింద 40 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంది. దీనివల్ల 2021-22కి సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన మిగిలిన మొత్తం ఆగిపోయింది. మొత్తంగా 2020-21, 2021-22 సంవత్సరాలకు కేంద్రం నుంచి రావాల్సిన 3 వేల 514.68 కోట్లను రాష్ట్రం కోల్పోయింది.
Jaljeevan Mission జలజీవన్ మిషన్‌లో భాగంగా రూ.8వేల 395 కోట్లతో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రతిపాదించిన భారీ తాగునీటి ప్రాజెక్టుల్లో ఇంతవరకు కదలిక లేదు. పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికైతే సర్వేలతో కాలయాపన చేస్తున్నారు. ఇవి పూర్తయ్యాక పైపులైన్ల ద్వారా గ్రామాల్లోని రక్షిత తాగునీటి పథకాలకు నీరివ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 36.21 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చినా.. వీటిని గ్రామాల్లో ఇప్పటికే ఉన్న రక్షిత తాగునీటి పథకాలకు అనుసంధానిస్తున్నారు. ఆ నీరు సరిపోక చాలా ప్రాంతాల్లో కుళాయిలు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ఉమ్మడి ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.
Telangana No.1 జలజీవన్ మిషన్ అమల్లో ఏపీతో పోల్చితే చిన్న రాష్ట్రాల పనితీరు మెరుగ్గా ఉంది. కేంద్రంతో సమానంగా రాష్ట్ర వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ... ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంత ప్రజల దాహం తీరుస్తున్నాయి. గ్రామాల్లో వంద శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రంగా... జల్‌జీవన్ అవార్డు-2022 కింద తెలంగాణ ప్రథమ బహుమతి గెలుచుకుంది. గ్రామాల్లోని మొత్తం 53.98 లక్షల ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం కుళాయి కనెక్షన్లు ఇచ్చింది. తెలంగాణతో పోల్చితే జల్‌జీవన్ మిషన్ అమల్లో మన రాష్ట్ర పరిస్థితి అధోగతే అన్నట్లు ఉంది. రాష్ర్టంలో గ్రామీణ ప్రాంతాల్లో 95 లక్షల 54వేల 840 ఇళ్లు ఉండగా... జల్‌జీవన్ ప్రారంభమైన నాటికి 30.74 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. ఈ పథకం మొదలయ్యాక ఇప్పటివరకు 36.21 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన 30 శాతం అంటే... 28.5 లక్షల ఇళ్లకు ఎప్పుడిస్తారో ఆ దేవుడికే తెలియాలి.
అనవసర విషయాల్లో గొంతెత్తి గోల చేసే మంత్రులు... అవసరమైన అంశాల్లో ఎందుకు నోరు మెదపడం లేదని విపక్షాలు నిలదీస్తున్నాయి. ప్రజలకు మంచి చేసే జల్‌జీవన్ పథకంపై ఇకనైనా దృష్టి పెట్టి.. గ్రామీణ ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలని సూచిస్తున్నాయి.
Water problem in Krishna district పక్కనే కృష్ణా.. మరో వైపు గోదావరి.. తాగునీరు లేక దాహం కేకలు..!