కొవిడ్ కట్టడిలో ప్రభుత్వానికి స్వచ్ఛంద సేవా సంస్థలు సహకరించాలని రాష్ట్ర కొవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ రెడ్డి అన్నారు. 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లు, 26 స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో వర్చువల్ విధానంలో చర్చించారు. కొవిడ్ నివారణలో స్వచ్ఛంద సంస్థల సేవలను వినియోగించుకోవాలంటూ... జాతీయ విపత్తు నివారణ సంస్థ, నీతి ఆయోగ్ చేసిన సూచనల మేరకు ఎస్ఎంఎఎస్, యునిసెఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జవహర్ రెడ్డి తెలిపారు.
ధైర్యం కలిగించాలి...
కరోనా నివారణలో ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థల మధ్య సహకారం, సమన్వయం కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కె.ఎస్.జవహర్ రెడ్డి సూచించారు. కొవిడ్ బాధితులు, వారి కుటుంబీకులకు మానసిక, సామాజిక మద్దతును అందజేయడం ద్వారా వారికి ధైర్యం కలిగించాలని స్వచ్ఛంద సంస్థలకు సూచించారు. స్వయం సహాయక బృందాలు, గ్రామ వార్డు వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తల ద్వారా ప్రభుత్వం ఆమోదించిన ప్రచార సామగ్రిని బాధితులకు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వం తరఫున సహకారం కావాలి...
చిన్నారులు, వృద్ధుల కోసం సంచార వాహనాల ద్వారా కొవిడ్ టెస్టింగ్ సేవలను అందించాలని జవహర్ రెడ్డి కోరారు. బాలబాలికలు, అనాథలకు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రభుత్వం రూ.10 లక్షలు డిపాజిట్ చేసి, వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోందని జవహర్ రెడ్డి వివరించారు. ప్రజలకు నిరాటంకంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు తమ సిబ్బందికి వ్యాక్సినేషన్, గుర్తింపు కార్డులు, వాహన అనుమతుల వంటి సహకారాన్ని అందించాలని ఆయా సంస్థల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీచదవండి.