ఆషాడ సారె సమర్పణలతో గురువారం వరకు సందడిగా ఉన్న ఇంద్రకీలాద్రి... ఇప్పుడు శ్రావణ శోభను సంతరించుకుంది. నేటి నుంచి దుర్గామల్లేశ్వర దేవస్థానంలో శ్రావణ మాస పూజలు ప్రారంభమయ్యాయి. శ్రావణమాసంలో అమ్మవారు వరలక్ష్మిదేవిగా, శ్రావణ గౌరిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలు, ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారిణి కోటేశ్వరమ్మ వెల్లడించారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రావణమాసంలో పవిత్రమైన రోజులుగా భావించే శుక్రవారాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని వివరించారు. నాల్గొవ శ్రావణ శుక్రవారం నాడు ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తామని తెలిపారు. విశేష కుంకుమార్చనలు, ధనలక్ష్మి వ్రతం, లలిత సహస్రనామపారాయణాలు వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కోటేశ్వరమ్మ తెలిపారు.
ఇది కూడా చదవండి.