లాక్‌డౌన్ ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేయడంతో తెలంగాణలో పర్యాటకం(Telangana Tourism) తిరిగి ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని పుణ్యక్షేత్రాలతో పాటు.. కాళేశ్వరం ప్రత్యేక యాత్రలనూ తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రారంభించింది. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి రాగానే అక్కడికీ యాత్రలు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉంది.
నాగార్జునసాగర్, బాసర, వరంగల్, కొండగట్టు, కరీంనగర్‌తో పాటు పలు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకు తెలంగాణ పర్యాటక సంస్థ(Telangana Tourism) యాత్రలు నిర్వహిస్తోంది. అలాగే తిరుమలతో పాటు.. అక్కడి పుణ్యక్షేత్రాల దర్శనానికి వీలుగా బస్సులతో పాటు విమాన సేవలనూ అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు.
- ఉదయం వెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చేలా..
తెలంగాణలోని అన్ని పర్యాటక ప్రాంతాల(Telangana Tourism)కు ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేలా పర్యాటక అభివృద్ధి సంస్థ యాత్రలు నిర్వహిస్తోంది. కొవిడ్ నేపథ్యంలో ప్రస్తుతానికి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు లేనందున.. ఎవరైనా కుటుంబ సభ్యులు లేదా కార్యాలయాల సిబ్బంది.. ఇలా 15 మందికి తక్కువ కాకుండా ఉంటే.. వారిని కోరుకున్న చోటుకు తీసుకెళ్లేందుకు వీలుగా యాత్రలకు రూపకల్పన చేసింది. ఒకవేళ పర్యాటకులే ఎంపిక చేసిన ప్రాంతాలకు తీసుకెళ్లమని కోరినా సిద్ధంగా ఉన్నామని సంబంధిత అధికారులు చెప్పారు.
హైదరాబాద్‌కి చేరువలో ఉన్న అనంతగిరి అందాలను ఒక్క రోజులోనే చూసి వచ్చేయాలనుకున్నా.. లేదా ఒక రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు సాయంత్రం తిరిగి చేరుకునేలా స్థానికంగా బస ఏర్పాట్లు కల్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శనకు ఉదయం 5 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటల కల్లా నగరానికి చేరుకునేలా పర్యాటకాభివృద్ధి సంస్థ యాత్రను సిద్ధం చేసింది. నేరుగా వరంగల్ చేరుకుని అక్కడి హరిత హోటల్లో అల్పాహారం చేశాక.. రామలింగేశ్వర స్వామి(రామప్ప), మేడిగడ్డ బ్యారేజీ సందర్శన తర్వాత కాళేశ్వరంలో మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ తర్వాత సందర్శకులు కన్నెపల్లి పంప్‌హౌస్ చూశాక నగరానికి తిరుగు ప్రయాణం అవుతారు.
యాదాద్రి, భద్రాద్రి పుణ్యక్షేత్రాలతోపాటు వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, లక్నవరం, రామప్ప ఆలయం సందర్శనతో కూడిన కాకతీయ ప్రాంతాల యాత్ర ఉంటుంది. మరోవైపు, కొండగట్టు, వేములవాడ రాజన్న.. బాసర పుణ్యక్షేత్రాలతో పాటు.. బొగత జలపాతం వద్దకు కూడా పర్యాటకులను తీసుకెళ్లడానికి సిద్ధమైంది.
తిరుమలకు విమాన సేవలతో పాటు బస్సులోనూ..
తిరుమలకు బస్సుతో పాటు విమానంలోనూ భక్తులను తీసుకువెళ్లేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాట్లు చేసింది. తిరుమల వెంకన్న దర్శనం పూర్తయ్యాక కాణిపాకం, శ్రీకాళహస్తి, అలివేలు మంగమ్మ ఆలయాలనూ దర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది. అంతేగాకుండా పాపికొండలతో పాటు నాగార్జునసాగర్ - శ్రీశైలం మధ్య బోటు షికారు త్వరలోనే ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ 1800 4254 6464 నంబరులో సంప్రదించాలని సూచించారు.
ఇదీ చదవండి : Tirumala: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల