నేడు రాష్ట్ర వ్యాప్త బంద్‌కు భాజపా పిలుపునిచ్చింది. వైకాపా ప్రభుత్వం హిందూధర్మంపై దాడులను ప్రోత్సహిస్తోందంటూ.. నిరసనలు చేపట్టింది. గోవధ నిషేధంపై వైకాపా ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తూ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆందోళన చేశారు. అంతకముందు గోమాతను పూజించారు. రాష్ట్రవ్యాప్తంగా మండల, డివిజన్, జిల్లా స్థాయిలో భాజపా ఆందోళనలు చేస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిది బ్రిటీష్ మనస్తత్వమని ఆయన ఆరోపించారు. తరతరాలుగా ఆవును ఆరోగ్య కోసం, ఆధ్యాత్మికత కోసం వినియోగిస్తున్న దశలో.. వైకాపా నేతలు గోరక్షణ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడం ఆక్షేపణీయమని అన్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల్ని నయం చేసేందుకు గోమూత్రం వినియోగిస్తున్నారని అన్నారు. వైకాపా ఎమ్మెల్యే, ఆ పార్టీ నేతలు ఆవుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారిపై ముఖ్యమంత్రి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు.
బలవంతపు మతమార్పిడిని నిరాకరించినందుకు ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఎస్టీలపై కొంతమంది భౌతికదాడులు చేసి తీవ్రంగా గాయపరిచారని మండిపడ్డారు. బలవంతపు మత మార్పిడులను భాజపా ఆషామాషీగా తీసుకోబోదని అన్నారు. భాజపా ధర్మబద్ధమైన పార్టీ అని స్పష్టం చేశారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు వైకాపా సిద్ధమా? అని సవాల్ చేశారు. తాము ఆధారాలు, దస్త్రాలతో వస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవరాత్నలే తమ అభివృద్ధిగా చెబుతోందని... కేంద్రం వంద రత్నాలు ఇస్తోందన్నారు.
ఇదీ చూడండి:
దేవినేనిపై హత్యాయత్నం కేసుతో చంద్రబాబు ఆగ్రహం.. పార్టీ నేతలతో అత్యవసర సమావేశం