ప్రజా సమస్యల ఎజెండాయే లక్ష్యంగా వైఎస్సార్టీపీ(ysrtp) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర (Sharmila Praja prasthanam) చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి తుడి దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 20న తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 రోజులపాటు 90 అసెంబ్లీ, 14 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొనసాగుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్టీపీ కార్యాలయంలో పాదయాత్ర వివరాలను ఆయన వెల్లడించారు.
ప్రతిరోజూ ఉదయం 8:30 గంటల నుంచి 12 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు పాదయాత్ర కొనసాగుతుందని తుడి దేవేందర్ రెడ్డి వెల్లడించారు. షర్మిల పాదయాత్రలో ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష యథావిథిగా కొనసాగుతుందన్నారు. ఆమె పాదయాత్ర ఎక్కడ జరుగుతుంటే అక్కడే దీక్షను కొనసాగిస్తారని తెలిపారు. మంగళవారం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్ షర్మిల నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు, ప్రస్తుత ప్రభుత్వ హామీలు, వాటి అమలు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో లాంటి అంశాలను పాదయాత్ర ద్వారా తెలుసుకుంటారని తుడి దేవేందర్ రెడ్డి తెలిపారు.
వైఎస్సార్టీపీ స్థాపించి వంద రోజులైంది. ఈనెల 20వ తేదీ నుంచి మా పార్టీ అధినాయకురాలు పాదయాత్ర చేపట్టబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా జరిగిన పాదయాత్ర అంటే అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిదే. ప్రజా సమస్యలను పాదయాత్ర ద్వారా తెలుసుకుని వారి కలలను సాకారం చేశారు. అదే బాటలో వైఎస్ షర్మిలమ్మ పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రలో కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష కొనసాగుతుంది. బంగారు తెలంగాణగా మారుస్తామని పాలకులు మాట తప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. - తుడి దేవేందర్ రెడ్డి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి
ఇదీ చూడండి:
CM Jagan review on power: థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత రాకుండా చూడాలి: సీఎం జగన్