విజయవాడలోని పాయికాపురంలోని పుచ్చలపల్లి సుందరయ్య మునిసిపల్ పాఠశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగిపోతోంది. ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత లేని నిరుపేదలు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఇక్కడ చేరుతున్నారు. ఈ ప్రాంగణంలో ఒక వైపు ఎలిమెంటరీ.. మరోవైపు ఉన్నత పాఠశాల నడుపుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా స్థలం లేని కారణంగా.. హైస్కూలుకు సంబంధించిన భవనాన్ని ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనివార్య కారణాల వల్ల ఈ కట్టడాలు సగంలోనే ఆగిపోగా... నిరుపయోగంగా మారాయి.
అమ్మ ఒడి పథకం ప్రభావంతో భారీగా చేరికలు
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం అమల్లోకి వచ్చిన కారణంగా... రెండు పాఠశాలల్లో ఎక్కువ మంది పేద విద్యార్థులు చేరారు. వీరందరికీ తరగతుల వారీగా వేర్వేరుగా పాఠాలు చెప్పలేకపోతున్నారు ఉపాధ్యాయులు. ఒకే గదిలో నాలుగు తరగతుల పిల్లల్ని కూర్చోబెట్టి చదువు చెబుతున్నారు. ఈ సమస్యను ఉపాధ్యాయులు స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు దృష్టికి తీసుకెళ్లగా... త్వరలో పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదంతా ఒక ఎత్తయితే... బోధించడానికి సరిపడా ఉపాధ్యాయులూ లేకపోవడం మరో సమస్య.ఈ పరిస్థితికి తోడు ఉన్నత పాఠశాల భవనం 2వ అంతస్తు పైకప్పు శిథిలావస్థకు చేరిన ఫలితంగా.. పాఠశాల ఆవరణలోని చెట్ల కింద వరండాల్లో పిల్లల్ని కూర్చోబెట్టి పాఠాలు బోధించాల్సి వస్తోంది.
అధికారులు స్పందించరా?
విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకోకుండా నిద్రావస్థలో ఉన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత వర్గాలు సత్వరమే స్పందించి పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని స్థానికులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇది చూడండి: ట్విట్టర్లో శారీ ట్రెండ్.. ప్రియాంక పెళ్లి చీర వైరల్