తూర్పు గోదావరి జిల్లాలో రెండో రోజూ కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. అమలాపురం మండలం సహా.. కోనసీమ వ్యాప్తంగా వందల సంఖ్యలో పందేల బరులు వెలిశాయి. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు మండలాల్లో ఉదయం నుంచి పందేలను నిర్వహిస్తున్నారు. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. వీటితో పాటు గుండాటలు జోరుగా నిర్వహిస్తున్నారు. వీటిని అడ్డుకునేందుకు పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి.
రూ.లక్షల్లో పందేలు
పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో రోజూ కోళ్లు కత్తులు దూస్తున్నాయి. ఆచంట నియోజకవర్గంలోని తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచే కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లతో బరులన్నీ కిక్కిరిసిపోయాయి. తేతలి, దువ్వ, వేల్పూరు, అత్తిలి, ఇరగవరం తదితర ప్రాంతాల్లో కోడి పందేలతో పాటు... గుండాట, పేకాట పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. రెండోరోజూ పందెం రాయుళ్లు బరుల వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లక్షల రూపాయల పందేలు కాస్తున్నారు.
వింధు బోజనం
పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో భారీ స్థాయిలో కోడిపందేలు జరగుతున్నాయి. వీటిని ఆడేందుకు, తిలకించేందుకు వచ్చినవారికి ఉచిత భోజనం ఏర్పాటు చేశారు పందెం నిర్వాహకులు. అదీ కోడి మాంసం కూరతో. ఇంకేముంది... వందల సంఖ్యలో పందెంరాయుళ్లు బారులు తీరారు. వందల కిలోల చికెన్ వండి వడ్డిస్తున్నారు. పండగ పూట ఆనందంగా గడపడానికి వచ్చి ఆకలితో ఉండకూడదని ఖర్చుకు వెనకాడకుండా ఈ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
ఎల్ఈడీ తెరలు
కృష్ణా జిల్లాలోనూ కోళ్లు కత్తులు దూస్తున్నాయి. జిల్లాల్లో పలు చోట్ల సంప్రదాయ కోడి పందేలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. పెనమలూరు, గుడివాడ, గన్నవరం, అవనిగడ్డ, మైలవరం, నందిగామ నియోజక వర్గాల్లో పలు గ్రామాల పరిధిలో పందెం కోళ్లు యథేచ్చగా ఎగురుతున్నాయి. పెద్ద ఎత్తున బరులు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వీటిని వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకంగా పెద్ద ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. గన్నవరం సమీపంలోని అంపాపురం వద్ద కోడి పందేల బరులు తిరునాళ్లను తలపిస్తున్నాయి. వేల వాహనాల రాకతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది. తెలంగాణ సహా సమీప జిల్లాల ప్రజలు ఇక్కడికి వచ్చారు. పనిలో పనిగా గుండాట కూడా కొనసాగుతోంది.
పొట్టేళ్ల పందేలు
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో సంక్రాంతి పండగ పురస్కరించుకుని పొట్టేళ్ల పందేలు జరిగాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి 17 పొట్టేళ్లు ఇందులో పాల్గొన్నాయి. వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరయ్యారు.
ఇదీ చదవండి