కృష్ణాజిల్లా నందిగామలో పారిశుద్ధ్య కార్మికులు నాలుగు రోజులుగా సమ్మె చేస్తుండడంతో పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ... మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న 108 మంది కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. దీంతో రోడ్లు, మురికి కాలువలు శుభ్రం చేసి చెత్తా చెదారం తొలగించే పనులు ఆగిపోయాయి. చెత్తకుండీలో చెత్త పూర్తిగా నిండి పోయింది. పట్టణంలో పాటు శివారు గ్రామాలైన అనాసాగరం, హనుమంతు పాలెం గ్రామాల్లో రోడ్ల వెంబడి చెత్తాచెదారం పేరుకుపోతుంది. ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోవడం వల్ల దుర్వాసన వస్తోందని, దీనివల్ల పట్నంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.
ప్రస్తుత కరోనా సమయంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయట్లేదు. మూడు నెలల వేతనాలు, ఆరు నెలల అలవెన్సులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా కనీసం చర్చ్ వద్ద పారిశుద్ద్యం మెరుగుకు అధికారులు చర్యలు తీసుకోలేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: