మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఇచ్చిన సంజాయిషీ నోటీసుకు సాధారణ పరిపాలన శాఖ రాజకీయ విభాగం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వివరణ ఇచ్చారు. తన సమాధానాన్ని ప్రస్తుత ఇన్ఛార్జ్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్‌కు పంపారు. పూర్తి వివరణతో కూడిన లేఖను పంపిన ప్రవీణ్ ప్రకాశ్ తనవైపు నుంచి ఎలాంటి ఉల్లంఘనలూ జరగలేదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అవార్డులు, గ్రామ న్యాయాలయాల విషయంలో అప్పటి సీఎస్-సీఎం సమక్షంలో తీసుకున్న నిర్ణయాల మేరకే తాను ఆదేశాలు ఇచ్చానని వివరణ ఇచ్చారు. గ్రామ న్యాయాలయాల అంశాన్ని కేబినెట్ ముందుకు తీసుకురాకపోవడానికి గల కారణాలను అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి వివరించానని ప్రవీణ్ వివరణ లేఖలో పేర్కొన్నారు. తన వివరణను పట్టించుకోకుండా షోకాజ్ నోటీస్ ఇవ్వడం బాధించిందని స్పష్టం చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్ఆర్ శంకరన్, ఏవీఎస్ రెడ్డి, యుగంధర్ వంటి వారి స్పూర్తితో పనిచేస్తున్నానని తెలిపారు. ఏపీ కేడర్ ఐఏఎస్‌లు అంతా అదే స్పూర్తితో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. ఆ స్పూర్తికి విరుద్ధంగా ఈ అంశం తెరపైకి రావటం బహిరంగం కావటం తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.
ఇదీ చూడండి: ప్రధాని మోదీ సమీక్షకు.. ఇంఛార్జ్ సీఎస్ హాజరు