కృష్ణా జిల్లా వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
అవనిగడ్డలో
కృష్ణా జిల్లా అవనిగడ్డ పరిధిలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 6 జడ్పీటీసీలు, 75 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పర్రచివర ఎంపీటీసీ సెగ్మెంట్.. తెదేపా అభ్యర్థి హత్యతో ఎన్నిక నిలిచిపోయింది.
మోపిదేవిలో
మోపిదేవి మండలం కోసురువారిపాలెంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు.
గన్నవరంలో
గన్నవరంలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించిన వారిని మాత్రమే.. ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు.
నాగాయలంకలో
నాగాయలంకలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
నాలుగు మండలాల్లో
నూజివీడు, ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి మండలాల్లో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు లేని వారిని పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదు.
వత్సవాయి, పెనుగంచిప్రోలులో
వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలలో పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. వ్యవసాయ పనుల నిమిత్తం.. రైతులు, కూలీలు ఉదయాన్నే పనులకు వెళ్లారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి కనిపించడం లేదు. మొదటి గంటలో కేవలం ఐదు శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
నందిగామలో
నందిగామ నియోజకవర్గంలో.. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. చందాపురం పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు బోసిపోతున్నాయి. చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో.. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ముప్పాళ్లలో తెదేపా అభ్యర్థులు సైతం బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో.. క్యూలైన్లలో ఉన్న వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నిడమానూరులో
విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో.. పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి కనబర్చక పోవడంతో పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి.
ఇదీ చదవండి: పోటీలో విత్డ్రా చేసుకున్న అభ్యర్థి పేరు.. పోలింగ్ వాయిదా