కృష్ణా జిల్లా వాలంక గ్రామంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో స్థానిక ఎస్సై రవిచంద్రకుమార్ రెండ్రోజుల క్రితం 12 మందిపై కేసు నమోదు చేశారు. గ్రామ మహిళా వాలంటీరు పెదసింగు అనంతలక్ష్మి భర్త పోలీసులకు పంపించిన ఫొటో ఆధారంగా పోలీసులు నిందితులను తీసుకెళ్లారని, సంఘటన స్థలంలో ఎవరినీ పట్టుకోలేదన్నది గ్రామస్థులు ఆరోపించారు. దీనిపై వాలంటీర్ భర్తను ప్రశ్నించేందుకు గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు యడవల్లి వీరబాబు ఆధ్వర్యంలో గ్రామస్థులు దాదాపు వంద మంది సమావేశమయ్యారు. దీనికి వాలంటీర్ భర్తను కూడా పిలిపించారు.
సమాచారం తెలుసుకున్న ఎస్సై రవిచంద్రకుమార్... హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావు, హోంగార్డు మురళిని తీసుకుని పోలీసు వాహనంలో అక్కడికి వెళ్లారు. లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో సమావేశం నిర్వహించడంతో అక్కడి వారిని లాఠీలతో చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో కొంతమంది గ్రామస్థులకు గాయాలయ్యాయి. దీంతో రెచ్చిపోయిన వాలంకవాసులు పోలీసులకు ఎదురుతిరిగారు. పోలీసులు జీపును వదిలి వెళ్లిపోయారు. పోలీసుల దాడిలో కొండ్రు కాజమ్మ (60), యడవల్లి దుర్గ (30)కు తీవ్ర గాయాలుకాగా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురికి కూడా గాయాలయ్యాయి.
జిల్లా కేంద్రానికి సమాచారం : కొంతమంది పెద్దలు రెండు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టటంతో అక్కడి పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. రూరల్ సీఐ కొండయ్య నేతృత్వంలో మచిలీపట్నం సబ్‌డివిజన్ పరిధిలోని ఎస్సైలు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, సిబ్బందితో కలసి వాలంక గ్రామానికి¨ వెళ్లారు. నిందితులు లొంగిపోవాలని, లేకుంటే గ్రామంలోని పురుషులను వాహనాల్లో తీసుకువెళతామని హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో 13 మంది నిందితులు లొంగిపోయినట్లు రూరల్ సీఐ ఎన్.కొండయ్య చెప్పారు. ప్రధాన నిందితుడైన ఎంపీటీసీ మాజీ సభ్యుడితోపాటు మరో 13 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనలో మరొకరిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి: మే 17 కంటే ముందే విమాన సర్వీసులు షురూ!