Police Notice to TDP Leader Yarlagadda Venkata Rao: చంద్రబాబు మళ్లీ ఏపీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ... గన్నవరం టీడీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో సుదర్శన నరసింహ స్వామి యాగం నిర్వహించారు. మూడు రోజులపాటు కానూరులోగల యార్లగడ్డ గ్రాండియర్ లో ఈ యాగం ఏర్పాటు చేశారు. నేపాల్ కు చెందిన ఋత్వికులు ఈ యాగంలో పాల్గొన్నారు. చంద్రబాబు పై ప్రభుత్వం నమోదచేసిన కేసుల నుంచి విముక్తి లభించాలని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని సంకల్పించారు. ఈ యాగంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.
యాగానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం: గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి యార్లగడ్డ వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న సుదర్శన నరసింహస్వామి యాగానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు నోటీసులు పంపారు. సీర్‌పీసీ సెక్షన్ 149 ప్రకారం యాగం వేదికైన యార్లగడ్డ గ్రాండియర్ యాజమాన్యానికి పెనమలూరు స్టేషన్ హౌస్ ఆఫీసరు పేరిట నోటీసు పంపారు. ఈ ఫంక్షన్ హాలు పక్కన ఖాళీ ప్రదేశంలో ఉయ్యూరు ఆర్డీవో వారితో 33 దీపావళి బాణసంచా విక్రయించే దుకాణాలకు అనుమతిచ్చామని అందులో పేర్కొన్నారు. ఈనెల 11, 12 తేదీల్లో అగ్నిప్రమాదాలకు కారణమయ్యే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని వెల్లడించారు. జనం ఎక్కువ గుమిగూడే అవకాశం ఉన్నందున కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదంటూ నోటీసులో పేర్కొన్నారు. ఇదంతా మందుజాగ్రత్తల్లో భాగంగా తెలియజేస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.
నున్నలో అర్ధరాత్రి ఫ్లెక్సీల వివాదం.. భారీగా మోహరించిన పోలీసులు
స్పందించిన యార్లగడ్డ: యార్లగడ్డ గ్రాండియర్ వేదిక పూర్తిగా ప్రైవేటు స్థలంలోని ఫంక్షన్ హాలు అని ఆయన పేర్కొన్నారు. దాని లోపల యాగం జరిపినా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండబోదని తెలిపారు. ఫంక్షన్ హాలు పక్కన ఖాళీ ప్రదేశాన్ని బాణ సంచా దుకాణల ఏర్పాటుకు అనుమతి ఇచ్చే విషయంలో రెవెన్యూ అధికారులు ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు తాము ఈ యాగం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని- కార్యక్రమం జరుపుతున్న సమయంలో నోటీసులు ఇవ్వడం ఏమిటని యార్లగడ్డ వెంకటరావు ప్రశ్నించారు. కేవలం రాజకీయ దురుద్దేశ్యంతో కూడుకున్న వేధింపులే అని పేర్కొన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించిన సమయంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్థానిక వాలంటీర్లు, ఇతర సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే వారికి నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలపై తాము న్యాయపోరాటం చేస్తామని యార్లగడ్డ వెంకటరావు తెలిపారు.
'తెలుగుదేశం అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ సుదర్శన నరసింహ స్వామి యాగం నిర్వహిస్తున్నాం. నేపాల్ కు చెందిన రుత్వికులు హోమం చేశారు. చంద్రబాబుపై సీఐడీ నమోదుచేసిన కేసుల నుంచి విముక్తి లభించాలని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ఈ యాగం నిర్వహించాం.' యార్లగడ్డ వెంకటరావు, టీడీపీ నేత