చేసిన అప్పు తీర్చలేదని బాలుణ్ని ఎత్తుకెళ్లిన వ్యక్తులను పోలీసులు జైపూర్‌లో అదుపులోకి తీసుకొని, బాలుడిని విజయవాడకు తీసుకొస్తున్నారు. జైపూర్ నుంచి వలస వచ్చి విజయవాడలో నివాసం ఉంటున్న సోను దంపతులకు ఎనిమిది నెలల బాలుడు ఉన్నాడు. సోను, జైపూర్‌కు చెందిన చాను దంపతుల నుంచి 36 వేల నగదు అప్పుగా తీసుకొని చెల్లించలేదు. ఈ క్రమంలో గొడవ కూడా జరిగింది. ఆవేశంతో చాను ఈ నెల 17న విజయవాడ వచ్చి బాలుడిని జైపూర్‌కు ఎత్తుకెళ్లిపోయారు. బాధితులు వెంటనే ఆత్కూరు పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు హుటాహుటిన జైపూర్ వెళ్లారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందింతులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ కిడ్నాపర్ల కంటే ముందే జైపూర్ చేరుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మన్నార్ గుడి ఎక్స్‌ప్రెస్‌లో జైపూర్‌కు బయల్దేరిన నిందితులను ట్రాన్స్పోర్ట్ నగర్ అదుపులోకి తీసుకున్నారు. అంతా కలిసి రైలులో విజయవాడ వస్తున్నారు. కిడ్నాప్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేవలం 40 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ ద్వారకా తిరుమలరావు వివరించారు.
ఇదీ చదవండి: అప్పు తీర్చలేదని.... బిడ్డ అపహరణ