వేసవి సెలవుకు ఇంటికి తాళం వేసి ఊళ్లకు వెళ్లేవాళ్లు... ఒక్క నిమిషం ఆలోచించాలని పోలీసులు చెబుతున్నారు. కుటుంబసభ్యులంతా కలిసి ఊళ్లకు వెళ్లిపోవడాన్ని.. దొంగలు అవకాశంగా తీసుకుంటున్నరని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా నేరాలు జరిగే తీరు పరిశీలిస్తే ఎండాకాలంలోనే అధికంగా జరుగుతున్నాయని పోలీసులు ఉదాహరణలూ చూపిస్తున్నారు. ఇంట్లో అందరూ సొంతూళ్లకు వెళ్లటమే కాక.. ఉన్న ఆ కొందరూ రాత్రి వేళల్లో ఆరుబయట, మేడపైన నిద్రించడమే చోరీలకు ప్రధాన కారణాలుగా వివరిస్తున్నారు. అందుకే.. విజయవాడ పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కాలంలో జరిగే దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పక్కా వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. ప్రజలకు జాగ్రత్తలు వివరిస్తూ.. చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఊళ్లకు వెళ్లే వాళ్లు ఎల్.హెచ్.ఎం.ఎస్ సిస్టమ్‌ను ఇంట్లో అమర్చుకోవాలని సూచిస్తున్నారు. కుటుంబసభ్యులందరూ ఊరికి వెళితే ఆ వివరాలు ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇంట్లో లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌ను అమరుస్తారు. ఇంట్లో విలువైన వస్తువులు ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరా నిఘా పెడతారు. వైఫై ద్వారా పనిచేసే వీటిని... సెల్‌ఫోన్‌కు, కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానిస్తారు.
ఇంటిని దోచేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కెమెరాకు ఉన్న సెన్సార్స్ యాక్టివేట్ అవుతాయి. నిందితుల ముఖ చిత్రాలు రికార్డు చేయడమే కాదు.. పోలీసులనూ అప్రమత్తం చేస్తాయి. ఈ ఏర్పాటుతో సంఘటనా స్థలంలోనే నిందితులను అరెస్ట్ చేసే అవకాశముంటుందంటున్నారు పోలీసులు. ఈ విధానానికి సమ్మతి తెలుపుతూ 30 వేల మంది నగరవాసులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
ఇవీ చదవండి..