ఓ వైపు లాక్డౌన్తో నిత్యావసర సరకులు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో తాగేందుకు నీరు లేక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. వారి ప్రాంతాల్లో ఉన్న ఉప్పునీరు తాగలేక.. దూరంగా ఉన్న చేతి పంపుల వద్దకు వెళ్లి దాహాన్ని తీర్చుకుంటున్నారు. కృష్ణా జిల్లా దివిసీమలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉప్పునీరు చొచ్చుకు వచ్చి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల ప్రక్కన కాలువ గట్టున ఉన్న చేతి పంపులు.. వేలమంది పజల దాహార్తిని తీరుస్తున్నాయి.
అవనిగడ్డలోని ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న చేతిపంపు, జయపురంలోని కాలువ గట్టుపై ఉన్న చేతిపంపు ద్వారా మాచవరం, జయపురం, హంసల దీవి , పాలకాయతిప్ప, విశ్వనాథపల్లెలో ఉన్న సుమారు పది వేల మంది దాహార్తిని తీర్చుకుంటున్నారు. వీటి దగ్గర అర్థరాత్రులు కూడా నీటికోసం ప్రజలు క్యూ కడుతున్నారు. భౌతిక దూరం పాటిస్తున్నప్పటికీ ఒకే పంపును వేల మంది వాడుతున్న కారణంగా కరోనా వస్తుందేమోనని భయపడుతున్నారు.
ఈ చేతి పంపుల దగ్గర పంచాయతీ వారు బ్లీచింగ్ చల్లాలని, శానిటైజర్ ఏర్పాటు చేయాలనీ గ్రామస్తులు కోరుతున్నారు. విజయవాడలోని కె.ఇ.బి కాలువ ద్వారా వచ్చిన నీటిని చెరువుల్లో నింపుకుంటుంటారు. వాటిని తాగునీటి పథకాల ద్వారా కుళాయి ద్వారా సరఫరా చేసినా... ఆ నీరు వాసన వస్తున్న కారమంగా.. ఎక్కువ మంది ప్రజలు ఇలా చేతి పంపుల నీటినే వాడుతున్నారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలకు ట్యాంకర్ ద్వారా నీరు అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదీ చూడండి: