People Suffering from Kidney Disease: మాయదారి కిడ్నీ రోగం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్ తండా ప్రజలను కబళించేస్తోంది. ఉన్నంతలో వ్యవసాయం చేసుకుంటూ పిల్లాపాపలతో ఆనందంగా గడిపే, ఆ పల్లెటూరి జనాన్ని అంతుచిక్కని వ్యాధి పట్టిపీడిస్తోంది. ఏ గడపను కదలించినా కన్నీటి గాథలే. ఇంటి పెద్దదిక్కు కోల్పోయి కొందరు.. ఎదిగిన కొడుకు నేలరాలి మరికొందరు జీవచ్ఛవంలా బతుకులీడుస్తున్నారు.
మూత్రపిండాల వ్యాధి బారిన పడి మచ్చాపూర్ తండా తల్లిడిల్లుతోంది. ఈ తండాలో 56 కుటుంబాలుండగా 285 మంది జనాభా నివసిస్తున్నారు. మూడేళ్లలో మూత్రపిండాల వ్యాధితో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఇటీవల ఐసీఎమ్ఆర్ వైద్యశిబిరంలో పరీక్షలు చేయగా, మరో 13 మంది అదే సమస్యతో బాధపడుతున్నట్లు నివేదికలు వచ్చాయి.
మాయదారి రోగం నయం చేసుకునేందుకు సమీప పట్టణాల్లోని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఇల్లు, ఒల్లు గుల్ల చేసుకుంటున్న దయనీయ పరిస్థితి. బతుకునిచ్చే భూములను తెగనమ్ముకున్ని దవాఖానాల్లో చూపించుకుంటున్నారు. పెద్దదిక్కు కోల్పోయి పుట్టెడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మూత్రపిండాల వ్యాధి శాశ్వతంగా పారదోలేందుకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని వేడుకుంటున్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కావడం వల్ల శుద్ధజలాలు అందడం లేదని వాపోతున్నారు.
ఇవీ చదవండి: