Sajjala Ramakrishna Reddy on mlc elections: అధికారంలో ఉన్నామా అనే అనుమానం సజ్జలకు కలగడం శుభ పరిణామని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఎద్దేవాచేశారు. రెండు రోజుల ముందే ప్రజలు ఉగాది పంచాంగం చెప్పారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కామెంట్ చేశారని, ఆ వ్యాఖ్యలను సజ్జల ఎండార్స్ చేశారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో వైనాట్ 175 అనే గొంతులు మూగబోయాయని విమర్శించారు. వైసీపీ డిక్షనరీలో లేని ప్రజలు, ప్రజాస్వామ్యం అనే పదాలను సజ్జల మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు.
బుల్డొజ్ అనేది వైసీపీ ఇంటి పేరని పయ్యావుల దుయ్యబట్టారు. ఈ ఫలితాలతో అధికార పార్టీ మరిన్ని అరాచకాలు చేస్తుందని తాము నమ్ముతున్నామని, ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నామన్నారు. పులివెందుల నుంచి ఓ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి గెలిచారని, త్వరలో మరో ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం నుంచి గెలవబోతున్నారని పయ్యావుల స్పష్టంచేశారు. ఈ ఎన్నికల ఫలితాలు తమ బాధ్యతను పెంచాయన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేల మీద సీఎంకే నమ్మకం లేదని, అందుకే ఎమ్మెల్యేలకు మంత్రులని పర్యవేక్షకులుగా పెట్టారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయకూడదని సజ్జల ఎలా అంటారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలని, తమ సంఖ్యా బలం 23 అని, తమ దగ్గరున్న ఎమ్మెల్యేలను లాక్కుంది ఎవరని నిలదీశారు. పోటీ చేయడాన్ని కూడా తప్పు పడతారా అని ఆక్షేపించారు. తమ ఓటర్లు వేరా.. ముఖం మీద ఎవరూ ఫలానా ఓటరని స్టిక్కర్ వేసుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై వ్యతిరేకతం ఉన్నందువల్లే మూడు ప్రాంతాల్లో ప్రజలు వైసీపీని తిరస్కరించారని పయ్యావుల విమర్శించారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు: పశ్చిమ రాయలసీమ కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని సజ్జల ఆరోపించారు. కౌంటింగ్‌లో ఆరు ఓట్లు కలిశాయని ఆర్‌వోకు ఫిర్యాదు చేశాం టీడీపీకి వచ్చిన ఓట్లలో వేలసంఖ్యలో బండిల్స్ కలిశాయని భావిస్తున్నాట్లు పేర్కొన్నారు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికను కోర్టులో సవాలు చేస్తామని వెల్లడించారు. కౌంటింగ్‌లో పాల్గొన్న అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. అధికారంలో మేమే ఉన్నామా అని ఒక్కోసారి అనిపిస్తోంది సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్లు సజ్జల తెలిపారు.
ఇవీ చదవండి: