రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను నిర్వహించడానికి వరదలు అడ్డంకిగా మారాయని ప్రభుత్వం చెప్పడం సాకు మాత్రమేనని... బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... వరదలు లేని సమయంలో కూడా నూతన పాలసీ పేరుతో ఇసుక సరఫరా నిలిపివేసి వేలాది కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం రోడ్డున పడేసిందని మండిపడ్డారు. గడిచిన ఆరు నెలలుగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ఉపాధి కోల్పోయి దుర్భర జీవనాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు 10 వేల రూపాయలు నష్టపరిహారం అందజేయాలన్నారు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ అధిక ధరలకు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నవంబర్ 1వ తేదీన ఇసుక రీచ్‌లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఇవీ చదవండి