కృష్ణా జిల్లా బట్లపెనుమర్రుకు చెందిన వెంకటరమణమ్మ, మహేంద్ర శిషగిరి దంపతులకు ఇద్దరు కుమారులు. మహేంద్ర శిషగిరి తనకున్న వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చి స్థానికంగా రెవిన్యూ కార్యాలయంలో పనిచేసేవాడు. పెద్ద కుమారుడు నీలాకృష్ణ చదువు మానేసి పాల వ్యాపారం చేస్తానని తల్లిదండ్రలకు చెప్పాడు. పశువులు కొనేందుకు డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఆవేశంతో 2001లో ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం ఆ దంపతులు సొంతూరు నుంచి కూచిపూడికి నివాసం మార్చారు. చిన్న కుమారుడు అరవింద్ విజయవాడలో ఇంటర్మీడియట్ చదివేవాడు. 2002, మార్చి 21న పరీక్ష రాసిన అనంతరం ఫోన్ చేసేందుకని హాస్టల్ నుంచి బయటకు వెళ్లి .. ఇప్పటి వరకు తిరిగి రాలేదు.
బిడ్డలు దూరమైన ఆవేదనతో ఆరోగ్యం క్షీణించి భర్త మహేంద్ర చికిత్స పొందుతూ.. ఈఏడాది జనవరిలో మృతి చెందారు. దీంతో వెంకటరమణమ్మ ఒంటరై పోయింది. అదృశ్యమైన కుమారుడు వస్తాడని ఆశతో 18 ఏళ్లుగా ఎదురుచూస్తోంది. బిడ్డ వస్తాడనే ఆశ ఇంకా ఉందని... ఆ ఆశతోనే అందరూ దూరమైనా.. బతుకుతున్నాని ఆవేదన వ్యక్తం చేస్తుంది.
కన్నబిడ్డల ఆసరా ఉండాల్సిన సమయంలో ఈ తల్లి ఒంటరిగా మిగిలిపోయింది. మరోవైపు జీవనం సాగించేందుకు ఎటువటంటి ఆధారం లేదని కన్నీరు పెడుతోంది. భర్త చనిపోతే ఇంతవరకు పెన్షన్ రాలేదని.. అధికారుల చుట్టూ తిరిగినా.. ఇంతవరకు ఎవ్వరూ పట్టించుకోలేదని రోధిస్తోంది. తన కుమారుడు వస్తాడనే నమ్మకం తనని బ్రతికిస్తుందని ఆ మాతృమూర్తి ఆశగా ఎదురుచూస్తోంది.
ఇదీ చదవండి: గాంధీలకు షాక్.. రాజీవ్ ఫౌండేషన్‌పై విచారణకు కమిటీ