ప్రొటోకాల్ ఖర్చుల కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం మొత్తానికి కేటాయించింది రూ.17 కోట్లు. వీటిని 26 జిల్లాల్లోని 679 మండలాలకు పంచితే ఎంత వస్తాయి? ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర సీనియర్ అధికారులు తరచూ ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తూనే ఉంటారు. ఆ ఖర్చులకు ఈ సొమ్ము ఏ మాత్రం సరిపోవని తహసీల్దార్లు పేర్కొంటున్నారు. ఒకవేళ బిల్లులు పెట్టుకున్నా అవి ఎప్పటికి వస్తాయో.. ఎంత వస్తాయో కూడా తెలీదు. దీంతో మంత్రి గారి పర్యటన ఖర్చును రెవెన్యూ సిబ్బంది తలా కాస్తా పంచుకోవలసిందే. భోజనాల ఖర్చులు ఒకరివైతే టెంట్లు, కుర్చీలకు ఒకరు పెట్టుకుంటారు. వాహనాలను మరొకరు భరించాలి.
వారు ఎక్కడి నుంచి తెస్తారు?..మండల కార్యాలయాలకు వచ్చే జనం నెత్తిన చెయ్యి పెట్టాల్సిందే!..‘అవసరాలు’ పెరిగిపోయినప్పుడు.. ప్రభుత్వం అధికారికంగా సొమ్ము ఇవ్వనప్పుడు రెవెన్యూ సిబ్బది ‘అవినీతినే’ మార్గంగా ఎంచుకుంటున్నారు.
రాష్ట్ర ఖజానాలో ఏర్పడిన సంక్షోభం కారణంగా.. మండల తహసీల్దార్ కార్యాలయాల అవసరాలకు నిర్దేశించిన నిధుల్లో కోత పడింది. స్టేషనరీ (ఓఓఈ) అవసరాల కోసం ప్రతి మండల కార్యాలయానికి రూ. 245 మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తోంది. అంతేకాదు ఈ కార్యాలయాల అవసరాలకు కేటాయించిన రూ. 30 కోట్లను గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది ఏకరూప దుస్తుల కొనుగోలుకు మళ్లించింది. ఆ నిధులను వెనక్కు పంపించాలని, నెలకు కేటాయించిన మొత్తాన్ని పెంచాలని రెవెన్యూ శాఖ పదేపదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఫలితం లేదు. ప్రొటోకాల్ అవసరాలు, వాహన వినియోగం, కోర్టు కేసులకు అయ్యే ఫీజులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో తహసీల్దార్, ఇతర సిబ్బందే భరించాల్సి వస్తోంది. ఆదాయ, కుల, కుటుంబ, ఇతర ధ్రువీకరణపత్రాలు పొందేందుకు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తుదారులు చెల్లించే మొత్తంలో కొంత తహసీల్దార్ కార్యాలయాల అవసరాల కోసం జిల్లా కలెక్టర్ కేటాయిస్తారు. ఉదాహరణకు ఒక సర్టిఫికేట్ మంజూరుకు దరఖాస్తుదారు నుంచి రూ.35 వసూలు చేస్తే అందులో ఏడు రూపాయలు రెవెన్యూ శాఖకు రావాలి. ఇందులో కనీసం 2 నుంచి 5 రూపాయల వరకు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లాలి. ఇలా జమ అయిన మొత్తంలో రూ. 30 కోట్లను గత ఫిబ్రవరి ప్రాంతంలో ఏకరూప దుస్తులకు వినియోగించారు. ఈ మొత్తాన్ని వెనక్కు ఇవ్వాలని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ.. ఇప్పటివరకు తిరిగి చేరలేదు.
‘‘రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా ఉందంటారు.. కానీ ప్రభుత్వం మంజూరు చేసే నిధులు తక్కువగా ఉంటే మేమేం చేయాలి? ఒక్కో తహసీల్దార్ కార్యాలయానికీ స్టేషనరీ ఖర్చుల కింద నెలకు రూ. 245 ఇస్తే ఎలా సరిపోతుంది? ప్రొటోకాల్ ఖర్చుల అవసరాలకు తగ్గట్లు నిధుల మంజూరు జరగడంలేదు. కోర్టు ఖర్చుల విషయంలోనూ ఇంతే. ఈ పరిస్థితుల్లో ఖర్చులు ఎలా భరించాలి? ఎంతకాలం సొంత జేబుల్లోంచి ఖర్చు పెట్టాలి?’’
- తహసీల్దార్ల ప్రశ్న ఇది
ఒకప్పుడు రూ.5,000..ఇప్పుడు రూ. 245 లే
ఇంతకుముందు మండల కార్యాలయాల స్టేషనరీ అవసరాల కోసం ప్రతినెలా రూ. 5,000 వరకు జిల్లా కలెక్టర్ ద్వారా కాస్త ఆలస్యంగానైనా వచ్చేది. ప్రస్తుతం నెలకు రూ. 245 మాత్రమే కేటాయించడం సిబ్బందికి విస్మయాన్ని కలిగిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పేర్కొన్న బడ్జెట్‌ను అనుసరించి రాష్ట్రంలోని 679 తహసీల్దార్ కార్యాలయాలకు కేటాయించిన నిధుల ప్రకారం నెలకు రూ. 245 మాత్రమే వస్తుందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. ధ్రువీకరణ పత్రాల మంజూరు కోసం దరఖాస్తుదారులు జతపర్చిన ఆధార పత్రాలను జెరాక్స్ తీసి, విచారణ జరిపి, ప్రింట్లు తీసేందుకు, సంక్షిప్తంగా నివేదికల తయారీకి అయ్యే ఖర్చుకు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మొత్తానికి ఏ మాత్రం పొంతన లేదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వైవీ రావు పేర్కొన్నారు.
వాహన వ్యయంలోనూ కోతే.. గతంలో రూ.35 వేలు ..ఇప్పుడు రూ.18,546 మాత్రమే
ఎంపీడీఓలు ప్రతి నెలా వినియోగించే ప్రైవేట్ వాహనాల అద్దె నిమిత్తం ప్రభుత్వం రూ.35,000 ఇస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు తహసీల్దార్లకు కూడా ఇంతే మొత్తాన్ని ఇచ్చేది. 2022-23 బడ్జెట్లో ఒక్కో ప్రైవేట్ వాహన వినియోగానికి నెలకు 18,546 మాత్రమే కేటాయించడంతో వాహనాల నిర్వహణ, ఇంధనం, డ్రైవర్ వేతనాలు ఎలా అని తహసీల్దార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోర్టు ధిక్కరణ ఖర్చు మాటేంటీ ?
భూ వివాదాలు, రేషన్ షాపు డీలర్లు, ఇతర విషయాల్లో కోర్టులో పిటిషన్లు దాఖలవుతుంటాయి. వాటిలో కొన్ని కేసులు కోర్టు ధిక్కరణ కిందకు వస్తున్నాయి. ఆ రోజున కోర్టుకు హాజరైన సీనియర్ అధికారుల తరఫున న్యాయవాదులకు తహసీల్దార్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఈ డబ్బు ఎక్కణ్నుంచి వస్తుందంటే.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్కో కోర్టు ధిక్కరణ కేసు కింద న్యాయవాదులకు రూ. 10,000 చొప్పున ఫీజు ఇవ్వాల్సి వస్తోందని, ఒక్కోసారి దీనికంటే ఎక్కువ ఖర్చు అవుతుందని, వీటికి ప్రత్యేకంగా బడ్జెట్ లేనందున ఇబ్బంది పడుతున్నామని తహసీల్దార్లు పేర్కొంటున్నారు.
పెద్ద నేతలు వస్తే అంతే..
ప్రొటోకాల్ ఖర్చుల కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రం మొత్తానికి కేటాయించింది రూ. 17 కోట్లు. ఇవి ఏ మాత్రం సరిపోవని తహసీల్దార్లు పేర్కొంటున్నారు. 26 జిల్లాల్లోని 679 మండలాలవారీగా చూస్తే ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర సీనియర్ అధికారుల పర్యటనల సమయంలో ఖర్చుకు, కేటాయించిన మొత్తానికి సంబంధం లేదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు పేర్కొన్నారు.
ఇవి చదవండి: