NTR centenary celebrations : హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కైతలాపూర్ మైదానంలో ఈ నెల 20న నిర్వహించే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ ఆధ్వర్యాన సాయంత్రం 5గంటలకు జరిగే కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన సహచరుల అభిప్రాయాలు, శక పురుషుడు’ ప్రత్యేక సావనీర్, ఎన్టీఆర్ సమగ్ర జీవిత విశేషాలు, సినీ పాటలు, సినిమాలు, ఉపన్యాసాలు తదితర పూర్తి సమాచారంతో రూపొందించిన ‘జై ఎన్టీఆర్’ వెబ్‌సైట్ ఆవిష్కరించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
పాల్గొననున్న ప్రముఖులు... ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సీపీఎం జాతీయ సెక్రటరీ సీతారామ్ ఏచూరి, బీజేపీ జాతీయ నేత పురందీశ్వరి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కన్నడ చిత్ర హీరో శివకుమార్, తెలుగు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, దగ్గుబాటి వెంకటేష్, సుమన్, మురళీమోహన్, నందమూరి కళ్యాణ్‌రామ్, హీరోయిన్ జయప్రద, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు ఆదిశేషగిరి రావు, అశ్వనీదత్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సావనీర్, వెబ్‌సైట్ ఆవిష్కరణలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, పలువురు ప్రముఖులకు కమిటీ పురస్కారాలు అందిస్తుందని వెల్లడించారు.
విజయవాడలో.. నందమూరి తారక రామారావు తెలుగు అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేస్తే.. తెలుగు వారు ఏం చేయగలరో చంద్రబాబు ప్రపంచానికి తెలియజేశారని టీడీపీ నేతలు అన్నారు. విజయవాడ తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా మినీ మహానాడు నిర్వహించారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు దేవినేని ఉమ, బోండా ఉమ, వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు, కొనకళ్ల నారాయణ, నెట్టెం రఘురాం, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహానుభావుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే కేంద్రానికి నిదర్శనం అయ్యాయని నేతలు తెలిపారు.
ఎవరైనా కొన్ని రంగాల్లోనే రాణించగలరని... కానీ, ఎన్టీఆర్ అన్ని రంగాల్లోనూ రాణించారని కొనియాడారు. పార్టీ స్థాపించిన తరవాత ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలు, యువత, మైనార్టీలకు చట్ట సభలలో అవకాశం కల్పించారని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన్నే ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలబెడితే, జగన్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని బయట పడేయటానికి రాష్ట్రాన్ని గాలికి వదిలేశాడని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ బాగు పడాలి అంటే చంద్రబాబు అధికారంలోకి రావాలన్నారు. ఈ నెల 27, 28న రాజమండ్రి జరగబోయే మహానాడులో అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి :