మంత్రి పేర్ని నానిపై దాడికి యత్నించిన నిందితుడు నాగేశ్వరరావును పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజులపాటు పోలీసులు ప్రశ్నించనున్నారు. నాగేశ్వరరావును కస్టడీ కోరుతూ పోలీసులు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం రెండు రోజులకు అనుమతినిచ్చింది. ఈ మేరకు నిందితుడ్ని మచిలీపట్నం జైలు నుంచి చిలకలపూడి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కేసులో ఇప్పటి వరకు మూడు దర్యాప్తు బృందాలను ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా నాగేశ్వరరావుతో సంబంధమున్న వ్యక్తులను.. ఫోన్ కాల్స్ ఆధారంగా మరి కొందరిని ప్రశ్నించారు.
నిందితుడ్ని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు దాడి చేయటానికి గల కారణాలపై పోలీసులకు ఇంకా స్పష్టత రాలేదని చెపుతున్నారు. మరోవైపు మంత్రిపై దాడి జరిగిన తర్వాత ఆయన నివాసం వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ లను ఏర్పాటు చేశారు. సిబ్బందిని పెంచి భద్రత కట్టుదిట్టం చేశారు.
మంత్రి పేర్నినానిపై దాడి కేసులో మాజీమంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు నోటీసులిచ్చారు. ఇటీవల మంత్రి నానిపై తాపీతో ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. ఇసుక దొరక్క పనిలేకపోవడంతో అక్కసుతోనే అతను దాడి చేసి ఉంటాడని కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలపై నోటీసులిచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఇవ్వాలంటూ కొల్లు రవీంద్రను పోలీసులు కోరారు.
ఇదీ చదవండి: