పెళ్లంటే ఇద్దరిమనుషుల మనస్సులను కలిపే వేడుక. రెండు కుటుంబాలను బంధాలతో దగ్గర చేసే అపూర్వ ఘట్టం. తరాలు మారుతున్నా పెళ్లి వేడుక వైభోగం తగ్గలేదు. ఒకప్పుడు మావిడాకుల తోరణాలు, కొబ్బరాకుల మండపాలు, అరటాకుల భోజనాలు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రకృతికి హాని చేసే ప్లాస్టిక్ మహమ్మారితోనే అన్ని పనులూ. ప్రతి వస్తువూ కాలుష్య కారకమే. ఈ ధోరణి నుంచి పర్యావరణాన్ని కాపాడటానికి ఓ వ్యక్తి నడుంబిగించాడు.పూర్వపు పద్ధతిలో పెళ్లి తంతును జరిపించి ఔరా! అనిపించాడు.
మట్టి గ్లాసులోనీళ్లు
కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మురళీకృష్ణ కాలుష్యంపై అవిరామపోరాటం చేస్తున్నారు. మాటలతో సరిపెట్టకుండా తన కుమారుడి వివాహాన్నిపూర్తి పర్యావరణ హితంగా నిర్వహించారు. ఫ్లెక్సీకి బదులు వస్త్రంపై పేర్లు రాయించారు. ఇంటి వద్ద వేసిన పందిరి నుంచి కల్యాణ మండపంలోని వేదిక అలంకరణ వరకు అన్నింటిని కొబ్బరి ఆకులతోనే చక్కగా చేయించారు. బంతి, మల్లి, గులాబి పూలు, చెరకు, అరటి బోదలు, మావిడాకులు, కొబ్బరి ఆకులు, కొబ్బరి కొండాలు, వరికంకులను ఉపయోగించి అచ్ఛమైన తెలుగు సాంప్రదాయాన్ని చక్కగా పాటించారు. చెక్క బల్లలపై అరటాకులు వేసి భోజనాలు వడ్డించారు. నీళ్లు ఇచ్చేందుకు మట్టి గ్లాసులు వాడారు. ఇక వంటకాల విషయానికొస్తే... సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరగాయలను వాడి ఆరోగ్యమైన ఆహారాన్ని అందరికీ అందించారు.
'శభాష్' మురళీకృష్ణ
ప్లాస్టిక్కు వ్యతిరేకంగా ఆయన చేస్తోన్న కృషిని పెళ్లికి వచ్చిన వారంతా అభినందించారు. కనులారా వేడుకతిలకించి శభాష్ అంటూ ప్రశంసించారు.
ఎంత ఖర్చు పెట్టాం, ఎంత మందికి భోజనం పెట్టాం.. ఎంత ఆధునికంగా చేశామన్నది ముఖ్యం కాదు. లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా.... మరో ఘనమైన వేడుక జరిగే వరకే గుర్తించుకుంటారు. కానీ మురళీ కృష్ణ చేసిన పెళ్లినిప్లాస్టిక్ భూతం నుంచి పర్యావరణాన్ని సంరక్షించే తొలి అడుగుగా అభివర్ణించొచ్చు.