ప్రతి విద్యార్థి ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యనభ్యసించేందుకు అవసరమైన సదుపాయాలు సమకూరుస్తున్నాం. కార్పొరేట్ పాఠశాలల తరహాలో బడులను తీర్చిదిద్దుతున్నామంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఇచ్చిన హామీకి అనుగుణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో రూ.లక్షల్లో నిధులు వెచ్చించి, ప్రభుత్వ పాఠశాలలకు వసతులు కల్పిస్తున్నా ప్రహరీల నిర్మాణాలను చేపట్టకపోవడంతో భద్రత పట్ల ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో బడి చుట్టూ రక్షణ గోడలు లేకపోవటం ఒక కారణమైతే, కాపలాదారులు లేక రాత్రి సమయాల్లో సంఘ విద్రోహశక్తులు విజృంభించటం మరో సమస్యగా మారనుంది.
విస్సన్నపేట మండలం నరసాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి విలువైన సామగ్రిని ధ్వంసం చేయడంతోపాటు, కొన్ని వస్తువులను చోరీ చేశారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు రెండుసార్లు చోటుచేసుకున్నాయి. రక్షణ గోడ లేకపోవడమే ఇందుకు కారణంగా ఉపాధ్యాయులు తెలిపారు. ఈ విద్యాలయంలో ప్రస్తుతం నాడు-నేడు పథకంలో భాగంగా ఆధునికీకరణ పనులు జరుగుతున్నా...ఈ పనుల్లో ప్రహరీ ఏర్పాటు మాత్రం లేదు.
జిల్లాలోని పలు పాఠశాలల్లో గతంలో దొంగలు చొరబడి విలువైన కంప్యూటర్లు చోరీ చేసిన సంఘటనలు పలు సందర్భాల్లో జరిగాయి. వివిధ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులున్నాయి.
మధ్యలోనే ఆగిన నిర్మాణ పనులు
జిల్లాలోని పలు విద్యాలయాల రక్షణ ప్రశ్నార్థకంగా మారిన విషయమై గతంలో అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లా పరిషత్తు యాజమాన్యం తమ విద్యాలయాల్లో రాత్రి కాపలాదారులను ఏర్పాటు చేస్తామని ప్రకటించినా, ఆచరణకు నోచుకోలేదు. సర్వశిక్షా అభియాన్ అధికారులు పలు విద్యాలయాలకు ప్రహరీల నిర్మాణానికి శ్రీకారం చుట్టినా వాటిని మధ్యలోనే నిలిపివేశారు. జిల్లావ్యాప్తంగా 588 పాఠశాలల్లో రూ.43.66కోట్ల వ్యయంతో వీటి నిర్మాణాలు చేపట్టారు. నిలిచిపోయిన గోడలను పూర్తి చేయాల్సిన అధికారులు వీటిని మినహాయించి, ఈ బడుల్లోనే ఇతరత్రా విలువైన పరికరాలతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. విద్యార్థులు నడిచే దారిలో విలువైన పెంకులతో రహదారి నిర్మాణం, ఒక్కొక్క మరుగుదొడ్డికి కనీసం రూ.25వేలకు పైగా వ్యయంతో తలుపులు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు రక్షణగోడలు లేక, మరోవైపు రాత్రి కాపలాదారులు లేక వీటిని ఎవరు కాపాడతారన్నది ప్రశ్నగా మారుతోంది.
పుట్రేల జడ్పీ ఉన్నత పాఠశాలకు రక్షణ గోడ లేకపోవటంతో గతంలో దొంగలు బడిలోకి చొరబడి విలువైన కంప్యూటర్లు ఎత్తుకెళ్లటంతోపాటు, ఒక వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఘటనకు తావిచ్చింది. వీటికి తోడు పాఠశాల ప్రాంగణంలో సంఘ వ్యతిరేక కార్యక్రమాలకూ ఆస్కారం ఏర్పడుతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దాతలు కొంతభాగం ప్రహరీ నిర్మించినా, మిగిలినభాగం గోడ నిర్మాణాన్ని మినహాయించి, నాడు-నేడు పనులు చేపట్టారు.
ప్రహరీల నిర్మాణం పూర్తి చేయిస్తాం
జిల్లావ్యాప్తంగా ప్రహరీల నిర్మాణానికి గతంలో మంజూరైన నిధులు నిలిచిపోవటంతో పనులు ఆగిపోయాయి. ఈ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. త్వరలో నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈలోపు నాడు-నేడు పనులు పూర్తి చేయిస్తున్నాం. నిలిచిపోయిన గోడల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయిస్తాం.
- వి.లక్ష్మణస్వామి, సర్వశిక్షా అధికారి
ఇదీ చదవండి: