సెలెక్ట్ కమిటీ పరిధిలో ఉన్న బిల్లులను గవర్నర్‌కు ఏ విధంగా పంపుతారని తెదేపా శాసనసభా పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ఇది కోర్టు ధిక్కారమేనని మండిపడ్డారు. విభజన చట్టం సవరించకుండా అమరావతి మార్పు... పార్లమెంట్‌ను ధిక్కరించడమేనన్నారు. ఈ సమయంలో కరోనా నివారణపై కాక అమరావతిపై ఎందుకు పాకులాడుతున్నారని ప్రశ్నించారు. విశాఖలో భూములు కాజేసేందుకే వైకాపా కుట్రపన్నిందని ఆరోపించారు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాజధానిని మూడు ముక్కలు చేసేందుకు కుట్ర పన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆఫీసులు మార్చడం వికేంద్రీకరణ కాదని, వికేంద్రీకరణ అంటే స్థానిక సంస్థలకు నిధులు, విధులు బదలాయించాలని హితువు పలికారు. కేంద్రం పంపిన స్థానిక సంస్థల నిధులను ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులను రంగులకు, ఇతర దుబారా ఖర్చులకు మళ్లించడంతో పాటు వికేంద్రీకరణ స్ఫూర్తికి పాతరేశారని మండిపడ్డారు. 50 శాతం నామినేటెడ్ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తానని చెప్పి.. సీఎం జగన్ సొంత సామాజికవర్గానికే సలహాదారుల పదవులు కట్టబెట్టి అభివృద్ధి వికేంద్రీకరణను కాలరాశారని రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: