MLA quota MLC Elections : తన అంతరాత్మ ప్రబోధానుసారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ, ఇతర ఎమ్మెల్యేలు కూడా వారి, వారి అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతుందన్న ఆయన.. సమస్యలు పరిష్కరిస్తే తానే ముఖ్యమంత్రిని అభినందిస్తానన్నారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.
తన నియోజకవర్గంలోని సమస్యలపై ప్లకార్డులను ప్రదర్శిస్తూ అసెంబ్లీకి పాదయాత్ర చేపట్టారు. నాలుగేళ్లు సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయే గళం వినిపిస్తున్నానని అన్నారు. మైకు ఇచ్చే వరకూ.. అసెంబ్లీలో మైక్ అడుగుతూనే ఉంటానని, ఇవ్వకుంటే ప్లకార్డుల రూపేణా నిలబడి నిరసన తెలుపుతానని చెప్పారు. ఇదిలా ఉండగా.. రాజధాని రైతులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పచ్చ కండువా కప్పి మద్దతు తెలిపారు. ప్లకార్డు ప్రదర్శన వద్దు అంటూ కోటంరెడ్డిని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్లే తనని అడ్డుకునే హక్కు పోలీసులకు లేదంటూ ప్లకార్డు ప్రదర్శనతోనే కోటంరెడ్డి అసెంబ్లీకి వెళ్లారు.
శాసన సభ్యుల కోటాలో జరిగే శాసన మండలి సభ్యుల ఎన్నికలో నా అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తాను. ఎవరేం చెప్పినా నా అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తాను అని స్పష్టంగా చెప్తున్నాను. (ఓటింగ్ కు సంబంధించి.. మిగిలిన సభ్యులు ఏవైనా సలహాలు ఇచ్చారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..) నేనే కాదు.. మిగతా సభ్యులకు కూడా ఒకటే చెప్తున్నా.. అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేయండి.. నేను ఇచ్చే సలహా కూడా ఇదే. - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
అధికార పార్టీలో ఆత్మప్రబోధ.. అధికార పార్టీ వైఎస్సార్సీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. ఇదే సమయంలో టీడీపీ బరిలోకి దగడం.. సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ అసమ్మతి ఎమ్మెల్యే కోటం రెడ్డి.. తాను ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తానని స్పష్టం చేశారు. మిగతా సభ్యులకు కూడా ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని చెప్తానని తనను ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారింది.
ఇవీ చదవండి :