Nara Lokesh Yuvagalam Padayatra in Penamaluru: ఉదయం నాలుగు కావస్తోంది.. రోడ్డుపై కిక్కిరిసిన జనం.. వేలాది మంది ప్రజలు భవనాలపై నుంచి చూస్తున్నారు. బాణసంచా సంబరాలు.. మేళతాళాలు.. పూల వర్షాలు.. వీటన్నింటి నడుమ యువనేత నారా లోకేశ్ చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారు. పెనమలూరులో పండగ ముందే వచ్చిందా అనే విధంగా వాతావరణం కనిపించింది.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్రకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. అర్థరాత్రి ఒంటి గంట దాటినా నారా లోకేశ్ కోసం వేలాది మంది మహిళలు, యువత వేచిచూశారు. భుజం నొప్పితో బాధపడుతున్నా.. బాధని దిగమింగుకొని చిరునవ్వుతో అందరిని పలకరిస్తూ ముందకు సాగారు. కార్యకర్త తన చిన్న పాపను తీసుకురాగానే తన భుజం నొప్పిని మర్చిపోయి లోకేశ్ ఆప్యాయంగా ఎత్తుకున్నారు.
అభిమానుల తాకిడి ఎక్కువవడంతో కరచాలనం చేసి వినతులు స్వీకరించే ప్రక్రియలో లోకేశ్ చేతికి స్వల్ప గాయాలయ్యాయి. తాడిగడప, పోరంకి పరిసరాల్లో జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా లోకేశ్ పాదయాత్ర కొనసాగించారు. మహిళలు, ప్రజలు అంతే జోరులో తమ మద్దతు తెలిపి అభిమానాన్ని చాటుకున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు నిడమానూరు గ్రామం వద్ద పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. గ్రామం వద్ద ప్రజలు, యువత భారీ గజమాలలతో లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు.
తెల్లవారుజామున 4 గంటలకు లోకేశ్ 189వ రోజు యువగళం పాదయాత్ర ముగిసింది. నిన్న సాయంత్రం 3 గంటల నుంచీ ఇవాళ తెల్లవారుజాము 4 గంటల వరకూ దాదాపు 12 గంటలు పైగా 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్విరామంగా సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో పాదయాత్ర షెడ్యూల్ కంటే 8 గంటలు ఆలస్యంగా సాగింది. అర్ధరాత్రి దాటాక కూడా పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు వేచి ఉండటంతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సాగారు.
బెజవాడలో తెలుగుదేశం మీసం మెలేసింది.. లోకేశ్ యువగళంకు బ్రహ్మరథం
Yuvagalam Padayatra in Gannavaram Constituency: 190వ రోజైన నేడు లోకేశ్ యువగళం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో దాదాపు 16 కిలోమీటర్ల మేర సాగనుంది. నిడమానూరు క్యాంప్ సైట్లో బీసీలు, చేతి వృత్తిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం మూడు గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. గూడవల్లి సెంటర్లో రజక సామాజిక వర్గీయులతో సమావేశం కానున్న లోకేశ్.. కేసరపల్లిలో స్థానికులతో భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద స్థానికులతో మాటామంతీ నిర్వహించనున్నారు. గన్నవరం ఊరచెరువు వద్ద స్థానికులతో లోకేశ్ భేటీ కానున్నారు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో లాయర్లతో సమావేశం కానున్నారు. రాత్రికి చిన్న అవుటపల్లి ఎస్ఎం కన్వెన్షన్ సెంటర్ వద్ద విడిది కేంద్రంలో లోకేశ్ బస చేయనున్నారు.
Grand Welcome to Lokesh Yuvagalam: ఉత్సాహంగా లోకేశ్ పాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం..