ప్రభుత్వానికి అన్నదాతలంటే ఎందుకింత కక్షో అర్థం కావడం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. 'రైతు కోసం' కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా దివిసీమలో సోమవారం ఆయన పర్యటించారు. వైకాపా పాలనలో 767 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని లోకేశ్ అన్నారు. రైతు భరోసా సాయం సక్రమంగా అందితే ఇంతమంది ఎందుకు చనిపోతారని నిలదీశారు.
మొదట నిమ్మకూరు వద్ద రహదారిపై వెళ్తున్న రైతులను కలిసి మాట్లాడారు. తుపానుతో తీవ్రంగా నష్టపోయినట్లు లోకేశ్‌కు రైతులు తెలిపారు. రంగు మారిన, తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని... మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోయామంటూ కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మచిలీపట్నం చేరుకుని రైతుల్ని పరామర్శించారు లోకేశ్. కొనుగోలు కేంద్రాలు పేరుకే ఉన్నాయని... ధాన్యం మాత్రం కొనడం లేదని అక్కడి రైతులు వాపోయారు. అనేక నిబంధనలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. చివరికి తక్కువ ధరకు దళారులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
చదువు బాధ్యత నాదే...
ఆ తరువాత అవనిగడ్డ నియోజకవర్గంలోని మాజేరుకు చేరుకున్న లోకేశ్‌కు తెదేపా నేతలు ఘన స్వాగతం పలికారు. తుపాను కారణంగా మాజేరులో పాడైపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. జగన్ ఒక ఫేక్ సీఎం అని మండిపడ్డారు. రైతుల కష్టాలను పట్టించుకోకుండా వ్యవసాయ శాఖ మంత్రి రికార్డు డ్యాన్స్‌లు చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పాగోలు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కృష్ణంరాజు కుటుంబాన్ని లోకేశ్ పరామర్శించారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు కృష్ణంరాజు రెండో కుమారుడు రోహిత్ కుమార్ చదువు బాధ్యత తాను తీసుకుంటానని లోకేశ్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం అవనిగడ్డ నియోజకవర్గం కొత్తపేటలో ఆత్మహత్య చేసుకున్న రైతు వెంకట కృష్ణయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.
ప్రభుత్వం రైతుల్ని ఆదుకోకుంటే వచ్చే 6నెలల్లో ఇంకా ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందని లోకేశ్ అన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెదేపా పోరాడుతుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి