కృష్ణా జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పై ఎలాంటి దాడి కానీ, దాడి చేసే ప్రయత్నాలు జరగలేదని నందిగామ సీఐ కనకారావు తెలిపారు. ఈ సంఘటన జరిగిన రోజు తనకు మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఫోన్ చేశారని.. తాను ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పటికీ వెంటనే మరో ఎస్సై తాతాచార్యులిని అక్కడికి పంపినట్లు తెలిపారు.
అప్పటికే పోలీస్ సిబ్బంది వారిని ఎందుకు వచ్చారని ప్రశ్నించారని తెలిపారు. ఆ తరువాత 15 నిమిషాలకు మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఇంటికి వచ్చారని ఆమెతో వచ్చిన వారు మాట్లాడారే తప్ప ఎలాంటి ఘర్షణ వాతావరణం జరగలేదన్నారు. అదే సమయంలో తమ సిబ్బంది వారిని అక్కడి నుంచి పంపివేసినట్టు తెలిపారు.
ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే సౌమ్య చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపినట్టు సీఐ తెలిపారు. నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా నందిగామలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉందని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇదే సమయంలో ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రశాంతంగా నందిగామ నగర పంచాయతీ ఎన్నికలు జరగడానికి అన్ని పార్టీల నాయకులతోపాటు ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: