MLA Vasanta Krishna Prasad : నియోజకవర్గంలో పరిస్థితుల వల్ల గడప గడపకూ మన ప్రభుత్వంలో పాల్గొనలేకపోయానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. అన్ని విషయాలపై సీఎం పూర్తి క్లారిటీ ఇచ్చారన్నారు. ఈ వారం నుంచి గడప గడపకూ కార్యక్రమం ప్రారంభిస్తానని తెలిపారు. తాను చురుకుగా లేకపోవడంతో పార్టీ మారతానని సోషల్ మీడియాలో ప్రచారం చేశారని, అవసరమైతే రాజకీయాలు మానేస్తాను గానీ జీవితంలో పార్టీ మారేది లేదని వసంత స్పష్టం చేశారు. సొంత పార్టీ వ్యక్తులు తనను ఇబ్బందులకు గురి చేసింది వాస్తవమని తెలిపారు. ఒక నియోజకవర్గం వారు వేరే చోట వేలు పెడితే చూస్తూ ఊరుకోనని సీఎం చెప్పారని వెల్లడించారు.
ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టి చికాకు సృష్టిస్తున్నారని సీఎంకు చెప్పాను. నియోజకవర్గంను అధిష్టానం పరిశీలిస్తుందని, కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో జోగి రమేష్, ధనుంజయరెడ్డి మీటింగ్ ఉంటుంది. భవిష్యత్తులో విభేదాలు ఉండవని అనుకుంటున్నాను. -వసంతకృష్ణప్రసాద్, ఎమ్మెల్యే
మైలవరంలో ఏం జరిగిందంటే.. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతల మధ్య నెలకొన్న పంచాయితీ మరోసారి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. మంత్రి జోగి రమేష్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య కొంతకాలంగా నెలకొన్న వర్గపోరు తారాస్థాయికి చేరింది. పరస్పరం తీవ్ర ఆరోపణలు, విమర్శలతో ఇరువర్గాలు రచ్చకెక్కాయి.
ఇరువర్గాల ఫిర్యాదు.. మంత్రి జోగి రమేష్ అనుచరుడు నల్లమోతు మధుబాబుపై ఎమ్మెల్యే వసంత అనుచరులు పలు పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టగా.. ప్రతిగా జోగి రమేష్ వర్గీయులూ ఫిర్యాదులు చేశారు. మంత్రి, ఎమ్మెల్యే వర్గాలతో రీజినల్ కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ చర్చలు విఫలమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన సీఎం జగన్.. బుధవారం జోగి రమేష్‌తో.. గురువారం వసంత కృష్ణ ప్రసాద్‌ను పిలిపించుకుని మాట్లాడారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సీఎంతో సమావేశమయ్యారు.
వైఎస్ జగన్‌తో సమావేశమైన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. మంత్రి జోగి రమేష్ వర్గీయుల వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వారి సంగతి వదిలేసి.. వెంటనే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అదేశాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులకు సీఎం సూచించినట్లు తెలిసింది. త్వరలోనే గడప గడపకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని సీఎంకు ఎమ్మెల్యే వసంత చెప్పినట్లు సమాచారం.
ఇవీ చదవండి :